అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ వేల్పూర్ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి విమర్శించారు. వేల్పూర్ మండల (Velpur mandal) కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Bheemgal | లబ్ధిదారులను బెదిరించడం ఎంతవరకు సబబు..
గత ప్రభుత్వంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల కోసం లబ్ధిదారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) పారదర్శకత కోసం నేరుగా తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించిందని నర్సారెడ్డి పేర్కొన్నారు. అయితే, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాత్రం లబ్ధిదారులను ఇబ్బంది పెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అందరినీ ఒకే వేదికపైకి పిలిపించి చెక్కులు పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేని వారికి చెక్కులు ఇవ్వవద్దని అధికారులను బెదిరించడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.
Bheemgal | అభివృద్ధిని చూసి ఓర్వలేకే..
గత పదేళ్లలో మీరు చేయలేని అభివృద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని నర్సారెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతో వాటివైపు ఎమ్మెల్యే చూడట్లేదన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు.
Bheemgal | అడ్డుకుంటామని హెచ్చరిక..
మిగిలిపోయిన లబ్ధిదారులకు తక్షణమే చెక్కులు అందజేయాలని.. లేనిపక్షంలో ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకుల హెచ్చరించారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా నేరుగా మండల కేంద్రాల్లోనే చెక్కులు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి, జిల్లా నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్, నాయకులు నరేందర్, రమణ, మల్లయ్య, జంగన్న, ఆర్మూర్ మోహన్, కిషన్ తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.