అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLA Arrest | కేరళలోని ఓ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆదివారం ఉదయం ఆయనను అరెస్ట్ చేశారు.
కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌ను (Palakkad MLA Rahul Mamkootathil) పోలీసులు ఓ హోటల్ గది నుంచి అదుపులోకి తీసుకున్నారు. పాలక్కాడ్ నుంచి తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని పతనంతిట్ట జిల్లాలోని పోలీసు శిబిరానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న పతనంతిట్ట జిల్లాకు (Pathanamthitta district) చెందిన ఒక మహిళ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. కాగా గతంలో సైతం ఓ నటి, మరో యువతి ఆయన లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. అయితే ఆ కేసుల్లో ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ పొందాడు. ఇటీవల మరో మహిళ ఆరోపణలు చేయడంతో ఆ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కాంగ్రెస్‌కు చెందిన రాహుల్‌ను ఆ పార్టీ గతంలోనే బహిష్కరించింది.
MLA Arrest | పెళ్లి చేసుకుంటానని..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని మహిళ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసింది. తాను గర్భవతి అయినప్పుడు బాధ్యత వహించడానికి నిరాకరించి, గర్భస్రావం చేయిస్తానని బెదిరించిందని ఆరోపించింది. అతను తన నుంచి అనేక సందర్భాల్లో డబ్బు తీసుకున్నాడని కూడా ఆమె పేర్కొంది. వీడియో కాన్ఫరెన్స్ ఆధారంగా పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. మమ్‌కూటథిల్‌పై గతంలో వచ్చిన రెండు లైంగిక వేధింపుల కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) మూడో ఫిర్యాదు దర్యాప్తు బాధ్యతను అప్పగించారు.