అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajasingh | అయ్యప్ప మాల వేసుకున్న ఓ సబ్ ఇన్స్పెక్టర్కు ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు. దీనిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ రూల్స్ హిందువులకే వర్తిస్తాయా అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్ నగరంలోని కంచన్బాగ్ ఎస్సై (Kanchanbagh SI) అయ్యప్ప దీక్ష వేసుకోగా.. ఉన్నతాధికారులు ఇటీవల మెమో జారీ చేశారు. పోలీసుల వంటి క్రమశిక్షణా దళంలోని ఏ సభ్యునికి కూడా విధి నిర్వహణలో ఉన్నప్పుడు మతపరమైన ప్రయోజనం కోసం జుట్టు, గడ్డం పెంచుకోవడానికి, బూట్లు లేకుండా సివిల్ డ్రెస్ (నల్ల డ్రెస్) ధరించడానికి ఎటువంటి అనుమతి జారీ చేయబడదని పేర్కొన్నారు. ఎవరైనా పోలీసు సిబ్బంది “దీక్ష” పాటించాలనుకుంటే వారు సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దీనిపై రాజాసింగ్ స్పందించారు.
Rajasingh | అప్పుడు ఎందుకు పెట్టరు
అయ్యప్ప దీక్ష (Ayyappa Deeksha) సమయంలోనే పోలీసులకు నియమ నిబంధనలు గుర్తుకు వస్తాయా అని రాజాసింగ్ ప్రశ్నించారు. ముస్లిం పోలీసులకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదన్నారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరన్నారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని ఆయన సూచించారు. ఇతర మతాల పండుగల సమయంలో సిబ్బందికి ముందు వెళ్లడానికి సమయం ఇస్తారన్నారు. వారు ఎప్పుడు వచ్చినా.. వెళ్లినా ఏమి అనరన్నారు. హిందువుల విషయంలో మాత్రమే ఇలా ఎందుకు చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాల వారిని సమానంగా చూడాలని కోరారు.
