అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Meesho Limited | మిడ్ క్యాప్ కేటగిరిలోని ఈ-కామర్స్ కంపెనీ మీషో లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో (Stock Market) అదరగొడుతున్నాయి. భారీ లిస్టింగ్‌తో ప్రారంభమైన ఈ షేరు.. వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది.
క్రితం రోజు ట్రేడింగ్ సెషన్‌లోనే 13 శాతానికి పైగా పెరిగి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.193.44ను తాకింది. గత వారం రోజుల వ్యవధిలోనే మీషో షేరు 10 శాతానికి పైగా లాభాన్ని ఇన్వెస్టర్లకు అందించగా… మొత్తం లాభం దాదాపు 15 శాతంకు చేరింది. ఈ దూకుడుతో కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా రూ.85,000 కోట్లను దాటింది. ప్రస్తుతం మార్కెట్ క్యాప్ సుమారు రూ.89,320 కోట్లకు చేరింది.
Meesho Limited | లిస్టింగ్ నుంచే అదిరిపోయిన ప్రదర్శన
మీషో లిమిటెడ్ వారం రోజుల క్రితమే స్టాక్ ఎక్స్చేంజీలు (Stock Exchange) బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ అయింది. ఐపీఓ ధరపై దాదాపు 55 శాతం ప్రీమియంతో లిస్టింగ్ గెయిన్స్ అందించి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి షేరు ధరలో స్థిరమైన పెరుగుదల కొనసాగుతోంది. క్రితం రోజు ట్రేడింగ్ సెషన్‌లో మీషో షేరు 5.7 శాతం లాభంతో రూ.180.50 వద్ద ముగిసింది. ఈ రోజు ట్రేడింగ్‌లోనూ మరోసారి జోరు చూపించింది. ఇంట్రాడేలో రూ.186.55 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన షేరు… కొద్ది సేపటికే రూ.199.49 ఇంట్రాడే హైను తాకింది. ఇదే ఈ షేరుకు 52 వారాల గరిష్ఠ ధరగా నమోదైంది. వార్త రాసే సమయానికి మీషో షేరు 9.32 శాతం లాభంతో రూ.197.14 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరుకు సంబంధించిన 52 వారాల కనిష్ఠ ధర రూ.153.89గా ఉంది.
మీషో లిమిటెడ్ దేశంలోని ప్రముఖ వాల్యూ యాడెడ్ ఈ-కామర్స్ మార్కెట్ (E-Commerce Market) ప్లేస్‌లలో ఒకటి. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగిస్తూ లక్షలాది చిన్న వ్యాపారులు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను నేరుగా కస్టమర్లతో అనుసంధానిస్తోంది. ఫ్యాషన్, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్ సహా పలు ఉత్పత్తులను తక్కువ ధరలకు అందించడం మీషో ప్రత్యేకతగా మారింది. ప్రస్తుతం బెంగళూరు (Bengaluru) కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీని డిసెంబర్ 2015లో ప్రారంభించారు. టియర్-2, టియర్-3 నగరాల్లో వేగంగా విస్తరిస్తుండటంతో పాటు… చిన్న వ్యాపారులకు పెద్ద మద్దతుగా నిలవడం వల్ల ఇన్వెస్టర్లలో మీషోపై విశ్వాసం పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
