అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mee Seva Services | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మీ సేవ అందిస్తున్న సేవలను మరింత సులభతరం చేయనుంది. ప్రస్తుతం మీ సేవ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను వాట్సాప్ (WhatsApp) ద్వారా అందించనుంది. ఈ మేరకు ఈ డిజిటల్ సేవలను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కుల, ఆదాయ, బర్త్, డెత్, రెసిడెన్స్ వంటి సర్టిఫికెట్ల కోసం మీ సేవా (Mee Service Centers) కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవాలి. అలాగే ఈ కేంద్రాల ద్వారా చాలా రకాల సేవలు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తును వాట్సాప్ ద్వారా చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆయా సర్టిఫికెట్లు పొందొచ్చు. దీంతో ప్రజల సమయం ఆదా అవుతుంది.
Mee Seva Services | డిజిటల్ గవర్నెన్స్‌లో భాగంగా..
డిజిటల్ గవర్నెన్స్ (Digital Governance)లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల సేవలను వాట్సాప్, ఆన్‌లైన్ ద్వారా అందిస్తోంది. డిజిటల్ గవర్నెన్స్‌లో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా తాజాగా చర్యలు చేపట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తొలుత సర్టిఫికెట్ సేవలను వాట్సాప్‌లో పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మీ సేవ కేంద్రాల ద్వారా 400కు పైగా సేవలు అందిస్తున్నారు. దశల వారీగా వీటిని కూడా వాట్సాప్‌లో పొందే అవకాశం కల్పిస్తామన్నారు. ఆదాయ ధృవీకరణ పత్రం, కుల, నివాస, జనన మరణ ధృవీకరణ పత్రాలు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ల కోసం ఇక నుంచి వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం వాటిని వాట్సాప్‌లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Mee Seva Services | ఇలా చేయాలి
వాట్సాప్‌లో మీ సేవ సేవల కోసం ఒక ఫోన్ నంబర్‌ను తీసుకు రానుంది. మంగళవారం దానిని అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ నంబర్‌ను ఫోన్లో సేవ్ చేసుకోవాలి. ఆ నంబర్‌కు వాట్సాప్‌లో “Hi” లేదా “మెనూ” ఆప్షన్ టైప్ చేసి పంపాలి. వెంటనే అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల జాబితా వస్తుంది.
ఆధార్ ఆధారిత ధృవీకరణ (OTP) ప్రక్రియను పూర్తి చేయాలి. తర్వాత అవసరమైన సేవను ఎంచుకోవాలి. దరఖాస్తు ఫామ్‌ను వాట్సాప్‌లోనే నింపే అవకాశం ఉంటుంది. అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫీజును సైతం ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించవచ్చు. అప్లికేషన్ స్టేటస్, అప్‌డేట్స్ వాట్సాప్‌లోనే వస్తాయి. సర్టిఫికెట్‌కు అధికారులు ఆమోదం తెలపగానే.. దానిని వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంతో ప్రజలు మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది.
