అక్షరటుడే, వెబ్డెస్క్ : Warangal | ప్రస్తుత రోజుల్లో పిల్లల పెళ్లిళ్లు చేయడం పెద్ద సమస్యగా మారింది. సరైన సంబంధాలు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటు ఉండటంతో పలువురు అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయిస్తున్నారు.
మ్యాట్రిమోనీ సైట్ల (Matrimony Sites)లో సంబంధాలు చూసి పెళ్లి చేసుకునే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. అయితే ఆయా సైట్లలో కొంతమంది మోసగాళ్లు సైతం రిజిస్ట్రర్ చేసుకుంటున్నారు. పెళ్లి పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు ఉండటం గమనార్హం. వరంగల్ జిల్లా (Warangal District)లో ఓ యువతి పెళ్లి చేసుకొని రెండు నెలలకే నగలు, డబ్బుతో ఉడాయించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Warangal | అంతా ఫేక్
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి (Parvatagiri Mandal) చెందిన ఓ యువకుడికి మ్యాట్రిమోనీ సైట్ ద్వారా విజయవాడకు చెందిన యువతి పరిచయం అయింది. అనంతరం వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కూడా వచ్చారు. పెళ్లి అనంతరం దంపతులు హన్మకొండ (Hanmakonda)లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే వారం క్రితం ఆ యువతి ఇంట్లోని బంగారం, నగదుతో పరారైనట్లు ఆలస్యంగా తెలిసింది. దీంతో బాధితుడు యువతి తల్లిదండ్రులను సంప్రదించే ప్రయత్నం చేయగా.. వారంతా ఫేక్ అని తెలియడంతో షాక్ అయ్యారు. సినిమా స్టోరీ తరహాలో నకిలీ తల్లిదండ్రులు, బంధువులను తీసుకొచ్చి సదరు యువతి పెళ్లి చేసుకుంది. కాగా సదరు యువతి గతంలోనూ పలువురిని మోసం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు
