అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | రాష్ట్రంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. మహా నగరం హైదరాబాద్ (mega city Hyderabad) నుంచి మొదలు పెడితే మారుమూల పల్లెల్లో సైతం నేడు గంజాయి దొరుకుతుందంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది యువత గంజాయికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో వివిధ రూపాల్లో గంజాయి విక్రయాలు చేపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంజాయి సిగరెట్లు (cigarettes) అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. పోలీసులు, అధికారులు దాడులు చేపడుతున్నా.. గంజాయి దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐడీఏ బొల్లారంలో (IDA Bollaram) గంజాయి చాక్లెట్ల కలకలం రేపాయి. బొల్లారం మున్సిపాలిటీ పరిధి లక్ష్మీనగర్‌లో నివాసం ఉండే ఒడిశాకు (Odisha) చెందిన అజయ్ కుమార్ (50) పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతడి పాన్‌షాప్‌లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 238 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
Hyderabad | ఇంట్లోనే గంజాయి సాగు
గంజాయికి బానిసగా మారిన వ్యక్తి ఇంట్లోనే గంజాయి సాగు చేశాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool district) అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు గంజాయికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. పోలీసులు అతడి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి మొక్కను ధ్వంసం చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
