Homeఆంధప్రదేశ్Hidma Encounter | హిడ్మా ఎన్​కౌంటర్​పై మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ

Hidma Encounter | హిడ్మా ఎన్​కౌంటర్​పై మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ

హిడ్మా ఎన్​కౌంటర్​పై మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. విజయవాడలో చికిత్స కోసం వెళ్లిన సమయంలో ఆయనను అరెస్ట్​ చేసి బూటకపు ఎన్​కౌంటర్​ చేశారని ఆరోపించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hidma Encounter | ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి జిల్లా మారేడ్​మిల్లి (Maredmilli)లో ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్ట్​ పార్టీ కీలక నేత హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్​కౌంటర్లలో హిడ్మా (Hidma) తో పాటు ఆయన భార్య రాజే, కీలక నేతలు టెక్ శంకర్ సహా పలువురు మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా దీనిపై మావోయిస్ట్​ కేంద్ర కమిటీ (Maoist Central Committee) లేఖ విడుదల చేసింది.

కేంద్రకమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మాడ్వి హిడ్మా, రాజేతో పాటు కొంతమందిని విజయవాడ (Vijayawada)లో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్న సమయంలో పట్టుకొని బూటకపు ఎన్​కౌంటర్​ చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు శంకర్​, మరికొంతమందిని పట్టుకుని హత్య చేసి రంపచౌడవరం ఏరియాలో ఎన్ కౌంటర్ (Encounter) జరిగిందని కట్టుకథను అల్లారని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చారు.

Hidma Encounter | చికిత్స కోసం వెళ్తే.

కేంద్ర ప్రభుత్వం (Central Government) కార్పొరేట్​ ప్రయోజనాల కోసం మావోయిస్టులను హత్య చేస్తోందని లేఖలో ఆరోపించారు. హిడ్మా, అతని భార్య రాజే కొద్దిమందితో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారని తెలిపారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహంతో పోలీసులకు సమాచారం చేరిందన్నారు. వీరిని నవంబర్ 15న అదుపులోకి తీసుకుని లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేశారని ఆరోపించారు. హిడ్మా గిరిజన గ్రామం నుంచి అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారన్నారు. తన కృషి, పట్టుదల, నైపుణ్యంతో అనేక దాడులకు వ్యూహ రచన చేశారని పేర్కొన్నారు.