అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ (Hyderabad) నగరంలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (Major Fire Accident) చోటు చేసుకుంది. పాతబస్తీలోని శాలిబండలో గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో మంటలు అంటుకున్నాయి. దీని ప్రభావంతో పేలుళ్లు చోటు చేసుకొగా.. ఒకరు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు.
శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూం (Gomati Electronics Showroom)లో సోమవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. మంటల ధాటికి అందులోని రిఫ్రిజిరేటర్లు, ఏసీ కంప్రెషర్లలో పేలిపోయాయి. పేలుళ్ల దాటికి షోరూమ్ ముందు పార్క్ చేసిన కారు బోల్తా పడి దగ్ధమైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు.
Hyderabad | బాంబు పేలుళ్ల మాదిరి..
రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పేలుళ్లు చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాంబు పేలుడు చోటు చేసుకున్నట్లు భావించారు. మంటలు అంటుకొని షో రూంలోని ఫ్రిజ్లు, ఏసీలు పేలడంతో భారీ శబ్ధాలు వచ్చాయి. పేలుళ్ల దాటికి దుకాణం షట్టరు ఎగిరి వచ్చి 100 మీటర్ల దూరంలో పడింది. షో రూం ముందు నిలిపి ఉంచిన కారుతో పాటు, బైక్లు కాలిపోయాయి. సీఎన్జీ కారు కావడంతో దాని సిలిండర్ సైతం పేలింది. ఈ ఘటనలో గోమతి ఎలక్ట్రానిక్స్ షాపు ఓనర్ శివకుమార్ సైతం గాయపడ్డారు. 80 శాతం కాలిన గాయాలతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షాపులో పని చేసే ముగ్గురు సిబ్బంది సైతం తీవ్రంగా గాయపడ్డారు.
డీసీపీ కిరణ్ ప్రభాకర్ (DCP Kiran Prabhakar), ఛత్రినాక ఏసీపీ చంద్రశేఖర్ (ACP Chandrashekhar) ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మంటలు పెద్దఎత్తున చెలరేగి పక్కన ఉన్న షాపులకు కూడా వ్యాపించాయి. దీంతో పోలీసులు పక్కన భవనాల్లోని వారిని ఖాళీ చేయించారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు.
