Homeజిల్లాలునిజామాబాద్​Limbadri Gutta | లక్ష్మీనృసింహ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Limbadri Gutta | లక్ష్మీనృసింహ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

భీమ్‌గల్‌ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని ఆలయం నుంచి కొండపైకి తీసుకువెళ్లారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్‌ గల్: Limbadri Gutta | భీమ్‌గల్‌ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి (Sri Lakshmi Narasimha Swamy) బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్సవ మూర్తులు గ్రామంలోని ఆలయం నుంచి కొండపైకి చేరుకోవడంతో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

బ్రహ్మోత్సవాలు మొదలయ్యే ముందు శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు (Brahmotsavams) నాంది పలికే కార్యక్రమం మంగళవారం ఆలయ పురోహితులు నిర్వహించారు. ఈ నాంది కార్యక్రమాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాల్లో భాగంగా మత్స్య గ్రహణం, దీపారాధన, రక్షాబంధనం, గరుడ పటాధివాసం, ధ్వజారోహణం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అంకురార్పణ కార్యక్రమాన్ని (Ankurarpana program) ఆగమ శాస్త్రం ప్రకారం పుట్ట మట్టిని సేకరించి పాత్రలో వేసి విత్తనాలు వేశారు. ఉత్సవాలు ఆరంభమైన నాటి నుంచి ముగింపు వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలన్న భావనతో అంకురార్పణ కార్యక్రమాన్ని వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Limbadri Gutta | అంకురార్పణ అంటే..

అంకురం అంటే మొలక అని అర్థం. ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించే ముందు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అదే విధంగా లింబాద్రి గుట్టపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభించే ముందు ఈ అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

Limbadri Gutta | వైఖానస పద్ధతిలో అంకురార్పణ..

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్ట మన్ను సేకరించి నవధాన్యాలను నాటే కార్యక్రమం జరుగుతుంది. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

Limbadri Gutta | సకల దేవతలకు ఆహ్వానం..

అంకురార్పణకు ముందు, మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మ పీఠాన్ని (Brahma Peetham) ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత అగ్నిహోత్రం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈశాన, జయ అనే సకల దేవతలను ఆహ్వానిస్తారు. కార్యక్రమంలో వేద పండితులు పార్థ సారథి, మహేష్, శ్రీనివాస్, ప్రణీత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.