అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Khagar | ఆపరేషన్ ఖగార్ విజయవంతమైంది. నక్సల్స్‌కు వ్యతిరేకంగా భద్రతా బలగాలు (security forces) చేపట్టిన ఏరివేత కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ఫలితంగా మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు చేరింది. దశాబ్దాల మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ఇక కాలగమనంలో కలిసిపోనుంది.
వరుస ఎన్‌కౌంటర్లతో పాటు లొంగుబాట్లతో (encounters and surrenders) పార్టీకి కోలుకోలేని రీతిలో దెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యులు సహా వందలాది మంది హతం కావడం, అదే స్థాయిలో లీడర్లు, కేడర్ లొంగిపోవడం, కొత్త రిక్రూట్‌మెంట్లు లేకపోవడంతో దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ ఇక చరిత్రలో మిగిలి పోయే స్థితికి చేరింది. అంతర్గత భద్రతకు ప్రమాకదకరంగా మారిన నక్సల్స్‌ను వచ్చే మార్చిలోగా తుద ముట్టించాలని కేంద్ర ప్రభుత్వం (central government) గడువు విధించుకుంది. కానీ ఆలోపే ఉద్యమ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒకనాడు సమాంతర పాలన కొనసాగించిన విప్లవ పార్టీ.. వరుస ఎదురుదెబ్బలు, పెరిగిన నిర్బంధాలతో మావోయిస్టు పార్టీ (Maoist party) మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది.
Operation Khagar | దశాబ్దాల పోరాటం..
దోపిడీ, అణచివేత వంటి వాటికి వ్యతిరేకంగా పుట్టిందే నక్సల్ ఉద్యమం. అణచివేతకు గురవుతున్న అణగారిన వర్గాల కోసం దాదాపు ఐదారు దశాబ్దాల క్రితం నక్సల్బరీ ఉద్యమం పురుడుపోసుకుంది. పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) నక్సల్‌బరి గ్రామంలో ఆవిర్భవించిన సాయుధ పోరాటం.. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. నక్సలైట్లుగా గుర్తింపు పొందిన మావోయిస్టులు తూర్పు, మధ్య భారత దేశంలో ‘రెడ్ కారిడార్’ ఏర్పాటు కోసం ఏకమయ్యారు. తూర్పున ఝార్ఖండ్ (Jharkhand) నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు దేశంలోని మూడొంతుల జిల్లాలకు విస్తరించారు. ఈ క్రమంలో గ్రామీణ పేదలు, ఆదివాసుల హక్కుల కోసం పోరాటం పేరిట చాలా ప్రాంతాల్లో సమాంతర పాలనను నడిపించారు. ప్రజల నుంచి బలమైన మద్దతు లభించడం, సానుభూతిపరులు పెరగడంతో విప్లవ పార్టీ కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది.
Operation Khagar | అంతర్గత భద్రతకు సవాలుగా..
జల్, జమీన్, జంగిల్ నినాదంతో ప్రజల్లో మద్దతు పొందిన మావోయిస్టు పార్టీ అనేక హింసాత్మక చర్యలకు దిగింది. మొదట్లో అణచివేతకు పాల్పడుతున్న భూస్వాములను, జమీందార్లను అంతమొందించింది. ఆ తర్వాత భద్రతా బలగాలు, రాజకీయ నేతలు, ఇన్ఫార్మర్లను కూడా హతమార్చింది. దాడులు, పేలుళ్ల ద్వారా వందలాది మంది పోలీసులను హత్య చేశారు. ఈ క్రమంలో విప్లవ పార్టీ దేశంలో అంతర్గత భద్రతకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలో (central and state governments) మావోయిస్టుల ఏరివేతకు నడుం బిగించాయి. ఆపరేషన్ ఖగార్‌కు శ్రీకారం చుట్టాయి. నక్సల్స్ ఉద్యమానికి చరమగీతం పాడాలన్న లక్ష్యంతో బలగాలను పూర్తి స్థాయిలో రంగంలోకి దించాయి. అందివచ్చిన టెక్నాలజీ, శాటిలైట్ ఇమేజింగ్, డ్రోన్ల వినియోగంతో పాటు అధునాతన ఆయుధాలు బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.
Operation Khagar | కరువైన షెల్టర్లు..
ఒకప్పుడు సేఫ్ షెల్టర్లుగా ఉన్న అడవులు సైతం ఇప్పుడు మావోల చేజారాయి. బలగాలు దండకారణ్యంలోకి (Dandakar forest) చొచ్చుకురావడంతో సురక్షిత స్థావరాలు లేకుండా పోయాయి. పెరిగిన నిర్బంధంతో మావోయిస్టులు కకావికాలమవుతున్నారు. ఇప్పటికే వరుస ఎన్‌కౌంటర్లలో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులే కాదు, ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ సైతం ఎన్‌కౌంటర్ కావడం నక్సలైట్లను కోలుకోలేని దెబ్బ తీసింది. కంచుకోటల్లోకి సైతం భద్రతా బలగాలు చొచ్చుకొస్తుండడం కొందరు లొంగిపోతుండగా, మరికొందరు అర్బన్ ప్రాంతాల్లో షెల్టర్ల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈక్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యుడు, గెరిల్లా పోరాటాలకు ఆద్యుడైన హిడ్మా సహా 13 మంది హతమయ్యారు. మరోవైపు, ఏలూరు, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్న నక్సల్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కేంద్ర కార్యదర్శి దేవ్‌జీ అనుచరులు, సంరక్షకులు సైతం అరెస్టయ్యారు. దేవ్‌జీ కూడా దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన ముఖ్య నేతలు గణపతి, తిరుపతి వంటి వారు సైతం లొంగిపోయేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కేంద్రం నిర్దేశించుకున్న గడువు లోపే మావోయిస్టు పార్టీ కనుమరుగయ్యే అవకాశముంది.
