అక్షరటుడే, వెబ్డెస్క్ : Nandigama | తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల పరంపర ఆగడం లేదు. సాధారణ ప్రయాణం కూడా మృత్యుమార్గంగా మారిపోతుండటం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ ఏడాదిలో ఏపీ–తెలంగాణ జాతీయ రహదారుల (National Highways)పై పదుల సంఖ్యలో బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం ప్రధాన కారణాలు అని నిపుణులు చెప్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా (NTR District)లోని నందిగామ బైపాస్ అనాసాగరం ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావేరీ ట్రావెల్స్ (Kaveri Travels)కు చెందిన ప్రయివేట్ బస్సు లారీని ఓవర్‌టేక్ చేసే సమయంలో ఎదురుగా వచ్చిన మరో లారీని ఢీకొట్టింది.
Nandigama | అతివేగమే కారణమా?
బస్సు హైదరాబాద్ (Hyderabad) నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన ప్రభావానికి బస్సు ఎడమ భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది. అప్పుడు బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆస్పత్రి (Nandigama Government Hospital)కి తరలించారు. అనేక మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు వేగంగా లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు ప్రయివేట్ బస్సుల డ్రైవింగ్ ప్రమాణాలపై, రోడ్డు భద్రత చర్యలపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సంబంధిత అధికారులు అత్యవసర చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లపై కఠిన నిబంధనలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్‌గా సౌదీ అరేబియాలో ఘోర విషాదం జరిగింది. మదీనా సమీపంలో ఒక ప్రయాణికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో జరిగిన భయానక ప్రమాదంలో సుమారు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దాదాపు 42 మంది భారతీయులే ఉన్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.ఈ ఘటనలో అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు భావించినప్పటికీ, ఒక్క వ్యక్తి మాత్రమే బ్రతికి బయటపడ్డాడు.
