అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy DCC President | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం ఎట్టకేలకు ఖరారైంది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల చారి ఉత్తర్వులు జారీ చేశారు.
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పార్టీ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ను ప్రకటించారు. డీసీసీ అధ్యక్ష పదవికి కామారెడ్డి జిల్లా నుంచి 28 మంది దరఖాస్తు చేశారు.
ఇందులో ప్రధానంగా మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, ఏలే మల్లికార్జున్ మధ్యనే పోటీ ఉంటుందని అందరూ భావించారు. దీంతో ఏఐసీసీ పరిశీలకుడు రాజ్ పాల్ నిర్వహించిన సమావేశంలో కైలాస్ శ్రీనివాస్ రావునే తిరిగి నియమించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే ఆయనకు రాని పక్షంలో ఇతర ఏదైనా పోస్టు ఇచ్చిన తర్వాతే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని షబ్బీర్ అలీ తెలిపారు.
అయితే కైలాస్ శ్రీనివాస్ రావుకు డీసీసీ రావడం కష్టమేనననే అనుమానంతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తనయుడు ఇలియాజ్తో చివరి నిమిషంలో దరఖాస్తు చేయించారని ప్రచారం సాగింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులతో ఒక్కొక్కరి అభిప్రాయం సేకరించిన సమయంలో కూడా సెకండ్ ఆప్షన్ కింద కైలాస్ శ్రీనివాస్ రావు పేరు చెప్పించారని ప్రచారం సాగింది.
Kamareddy DCC President | ఇద్దరు ఎమ్మెల్యేల సపోర్టు..!
జిల్లా కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయని ఇప్పటికే ప్రచారంలో ఉంది. డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో మరోసారి గ్రూపు రాజకీయాలు నడిచాయనే ప్రచారం సాగింది.
ఈ క్రమంలో నిజాంసాగర్ మండల అధ్యక్షుడు మల్లికార్జున్ నామినేషన్ వేయగా ఆయనకు ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంత్ రావు మద్దతుగా నిలిచారనేది టాక్.
ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి దక్కకూడదన్న పట్టుదలతో ఉన్నారనే ప్రచారం సాగింది. ఎట్టకేలకు కామారెడ్డికి డీసీసీ సారథి పదవి దక్కకుండా ఇద్దరు ఎమ్మెల్యేలు చక్రం తిప్పారని తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతాయోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
