HomeUncategorizedJustice Verma | సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన జ‌స్టిస్ వ‌ర్మ‌.. త‌న‌పై చ‌ర్య‌లు నిలిపివేయాల‌ని పిటిష‌న్‌

Justice Verma | సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన జ‌స్టిస్ వ‌ర్మ‌.. త‌న‌పై చ‌ర్య‌లు నిలిపివేయాల‌ని పిటిష‌న్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Justice Verma | తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ శుక్ర‌వారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వ‌చ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ఆయ‌న‌పై అభిశంస‌న తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న త‌రుణంలో జ‌స్టిస్ వ‌ర్మ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్ర‌యించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. త‌న‌పై విచార‌ణ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను స‌వాల్ చేస్తూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి(Delhi High Court Judge)గా ఉన్న స‌మయంలో ఆయ‌న అధికారిక నివాసంలో భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు ల‌భ్యం కావ‌డం దేశంలో సంచ‌ల‌నం రేకెత్తించింది. ఈ ఘ‌ట‌న‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అంత‌ర్గ‌త విచార‌ణకు ముగ్గురు స‌భ్యుల క‌మిటీని నియ‌మించింది. విచార‌ణ చేప‌ట్టిన ఈ క‌మిటీ జ‌స్టిస్ వ‌ర్మ (Justice Verma) ఇంట్లో లెక్క‌ల్లోకి రాని డ‌బ్బు భారీగా ల‌భ్య‌మైంద‌న్న విష‌యాన్ని నిర్ధారించింది. ఆయ‌న‌ను దోషిగా తేల్చడంతో పాటు వ‌ర్మ‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని సిఫార‌సు చేసింది. ఈ నేప‌థ్యంలోనే జ‌స్టిస్ వ‌ర్మ.. ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ అనుసరించిన ప్రక్రియ చట్టబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Justice Verma | వాస్త‌వాలు ప‌రిశీలించ‌కుండానే నివేదిక‌?

విచార‌ణ క‌మిటీ ఇచ్చిన నివేదిక పై జస్టిస్ యశ్వంత్ వర్మ అనేక సందేహాలు లేవ‌నెత్తారు. 11 సంవత్సరాలు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం న్యాయమూర్తిగా తన నిష్కళంకమైన కెరీర్‌ను జస్టిస్ వర్మ తన రిట్ పిటిషన్‌(Writ Petition)లో వివ‌రించారు. విచారణ కమిటీ అనుసరించిన విధానం తప్పు అని, తనను తాను సమర్థించుకోవడానికి తగిన అవకాశం ఇవ్వలేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ ఉదంతంలో కీలక వాస్తవాలను పరిశీలించకుండానే ఎంక్వైరీ కమిటీ (Inquiry Committee) తుది నిర్ణయానికి వచ్చిందని అన్నారు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్‌ను తనపై మోపడం తప్పని పేర్కొన్నారు. ఎంక్వెరీ కమిటీ అభిప్రాయాలను తప్పని నిరూపించాల్సిన బాధ్యతను తప్పుగా తనపై మోపారని తెలిపారు.

తనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలన్న సూచనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఎంక్వైరీ కమిటీ నివేదికను కొట్టివేయాలని జస్టిస్ వర్మ సుప్రీంకోర్టుకు విన్న‌వించారు. కమిటీ నివేదిక తన హక్కులను ఉల్లంఘించిందని అన్నారు. కమిటీ రిపోర్టు ఆధారంగా తనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలన్న మాజీ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా(Former Chief Justice Sanjiv Khanna) సూచనను పక్కన పెట్టాలని అభ్యర్ధించారు.

Justice Verma | అభిశంస‌నకు కేంద్రం నిర్ణ‌యం

త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మ‌రోవైపు, ఈ వ్యవహారంలో పోలీసు, ఈడీ విచారణలను కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కూడా ఇటీవల సుప్రీం కోర్టు స్వీకరించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పూర్తి స్థాయి విచారణ జరిగేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్లు (Petitioners) సుప్రీంను ఆశ్రయించారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు లభించినప్పుడు కేసు నమోదు చేయడం పోలీసుల బాధ్యత అని పిటిషనర్లు పేర్కొన్నారు.

Must Read
Related News