HomeజాతీయంCJI Suryakant | సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం

CJI Suryakant | సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CJI Suryakant | సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) ఆయనతో ప్రమాణం చేయించారు.

సీజేఐగా బీఆర్​ గవాయ్​ (CJI BR Gavai) పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి సీజేఐగా ఆయన సూర్యకాంత్ పేరును ప్రతిపాదించారు. దీనికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో సూర్యకాంత్​ తాజాగా ప్రమాణం చేశారు. ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

CJI Suryakant | హర్యానా నుంచి తొలివ్యక్తి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హర్యానా (Haryana) నుంచి బాధ్యతలు చేపట్టిన తొలివ్యక్తిగా సూర్యకాంత్‌ నిలిచారు. ఆయన ​ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్‌ జిల్లాలో జన్మించారు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సూర్యకాంత్​ 1981లో అక్కడి ప్రభుత్వ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ పట్టా పొందారు. 38 సంవత్సరాల వయస్సులో హర్యానాకు అతి పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్​గా పని చేశారు.

జస్టిస్​ సూర్యకాంత్​ (Justice Suryakant) 2004లో పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జడ్జిగా పని చేస్తూ కూడా ఆయన తన చదువు కొనసాగించడం గమనార్హం. 2011లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి తన మాస్టర్ ఆఫ్ లాలో ఫస్ట్ క్లాస్ సాధించారు.14 ఏళ్లు హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన ఆయన 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా (Supreme Court Judge) పదోన్నతి పొందారు. తాజాగా 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు.