అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad City | నిజామాబాద్ నగరంలోని పలు భవనాల నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సెట్‌బ్యాక్ నిబంధనలు పాటించకపోయినా, నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టకున్నా నగర పాలక సంస్థ అధికారులు ఎవరికి నచ్చినట్లు వారు పర్మిషన్లు ఇచ్చారు. కాగా తాజాగా కార్పొరేషన్ కార్యాలయంలో (Municipal Corporation Office) ఏసీబీ సోదాలు నిర్వహించగా.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో (town planning department) గతంలో పని చేసిన టీపీవోల హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు సమాచారం. ప్రత్యేకించి సెట్ బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించిన రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలకు (residential and commercial buildings) ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. నగరంలోని ప్రధాన రహదారులు వెంట ఉన్న కమర్షియల్ బిల్డింగ్లు నిబంధనల ప్రకారం లేకపోయినా.. వాటికి రాత్రికి రాత్రే కార్పొరేషన్ నుంచి అనుమతులు మంజూరు చేశారు. కొన్నింటికి ట్యాక్స్ అసెస్మెంట్ ఇవ్వడం గమనార్హం.
Nizamabad City | ఉల్లంఘనలు ఇలా..
వర్ని రోడ్డులో (Varni Road) ఓ కమర్షియల్ భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగింది. ఈ భవనం బీజేపీకి చెందిన మాజీ కార్పొరేటర్‌ది కావడంతో ఎలాంటి నిబంధనలు పాటించకపోయినప్పటికీ జరిమానాలు ఏవీ విధించకుండా నేరుగా ట్యాక్స్ అసెస్మెంట్ జారీ చేశారు. దీంతో నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా గండి పడింది.
పులాంగ్ చౌరస్తా సమీపంలో కొనసాగుతున్న ప్రముఖ ఐ హాస్పిటల్ భవనం (famous eye hospital building) కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని గుర్తించారు. కాగితాల్లో ఒక విధంగా.. నిర్మాణంలో మరో విధంగా ఉన్నప్పటికీ అనుమతులు ఇచ్చారు. దీనిపైనా అధికారులు విచారణ జరిపారు. ఇదే బిల్డింగ్‌కు సమీపంలో కొనసాగుతున్న ఓ ప్రైవేట్ పాఠశాల భవనం (private school building) సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగింది. దీనికి సైతం కార్పొరేషన్ అధికారులు నిబంధనలను పక్కన పెట్టి ట్యాక్స్ అసెస్మెంట్ జారీ చేశారు.
మాలపల్లిలో ఓ కమర్షియల్ బిల్డింగ్, కేసీఆర్ కాలనీలో ఓ వాణిజ్య సముదాయం, ఎల్లమ్మ గుట్టలో మరో బిల్డింగ్‌కు సంబంధించిన దస్త్రాలను అధికారులు పరిశీలించారు. వీటి అనుమతుల జారీ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోంది. 2023–25 మధ్య కాలంలో జారీ చేసిన భవనాల అనుమతుల ఫైల్స్‌పై ఏసీబీ (ACB) లోతుగా విచారణ చేపట్టింది.
ఖిల్లా రోడ్డులోని రెండంతస్తులకు అనుమతి తీసుకొని ఐదు అంతస్తుల బిల్డింగ్ నిర్మించారు. అప్పటి అధికారులు బల్డింగ్ యజమానికి అన్ని విధాలా అండదండలు అందించారు.
