అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Protests | ఇరాన్‌లోని 100కు పైగా నగరాలు, పట్టణాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభమే ఈ ఆందోళనలకు కారణమని మొదట చెప్పినప్పటికీ.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ నేతృత్వంలో కొనసాగుతున్న మతాధికార పాలనకు ముగింపు పలకాలని ప్రస్తుతం నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
Iran Protests | కఠినమైన అణచివేత
ఇరాన్‌లో నిరసనకారులపై భద్రతా దళాలు కాల్పులకు తెగబడినట్లు స్పష్టం అవుతోంది. టెహ్రాన్, బుషెహ్ర్, కర్మాన్షా, ఇలాం, రాష్ట్ తదితర నగరాల్లో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇలాం నగరంలోని ఇమామ్ ఖోమేనీ ఆసుపత్రికి 70కి పైగా మృతదేహాలు వచ్చినట్లు చెబుతున్నారు. టెహ్రాన్‌లోని ఓ హాస్పిటల్లో 38 మందికి పైగా మృతదేహాలు ఉన్నాయని సమాచారం. ఇరాన్ దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి.
Iran Protests | నిరసనకారులపై తీవ్ర వ్యాఖ్యలు..
నిరసనకారులపై ఇరాన్ అటార్నీ జనరల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. నిరసనలో పాల్గొంటున్న వారిని “దేవుడికి శత్రువులు”గా భావిస్తామని, ఇది మరణశిక్ష విధించే స్థాయి నేరమని పేర్కొన్నారు. ఇక నిరసనకారులను సుప్రీం లీడర్ ఖమేనీ “విధ్వంసకులు”గా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను సంతోషపర్చడానికే ఈ ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు.
అమెరికా హెచ్చరిక
నిరసనకారుల మీద కాల్పులు జరపడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఇరాన్ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు… ఇరానీయులకు సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం..” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖండించారు. ఆయన ఘాటుగా హెచ్చరించారు. యూఎస్ దాడి చేస్తే.. ఇజ్రాయెల్‌తో సహా మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలు, నౌకాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
నిరసనల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ ఆరోపించారు. “విదేశీయులను తమ దేశంలోకి పంపించి, ప్రార్థనా మందిరాలకు నిప్పు పెట్టించారని, మార్కెట్లపై దాడులు చేపడతున్నారని” అని విమర్శించారు. కాగా, దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడం గమనార్హం.
ఇంటర్నెట్ బంద్
దేశంలో నిరసనలు పెరగడంతో ఇరాన్ సర్కారు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. 2022లో జరిగిన ‘Women, Life, Freedom’ ఉద్యమం కంటే ఇది తీవ్రమైన బంద్‌గా విశ్లేషకులు వర్ణిస్తున్నారు. 2022లో మహ్సా అమినీ మృతితో చెలరేగిన ఉద్యమంలో 550 మందికి పైగా మరణించారు.
సంఘీభావం..
నిరసనకారులకు ఇరాన్ చివరి షా కుమారుడు, ప్రవాస నేత రెజా పహ్లవి మద్దతు తెలిపారు. “మీ ధైర్యాన్ని ప్రపంచం అంతా గుర్తిస్తోంది. త్వరలోనే నేను కూడా మీతో కలిసి ఉద్యమంలో నిలబడతాను..” అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. భద్రతా దళాల్లో సైతం అసంతృప్తి తీవ్రంగా ఉంటోందన్నట్లు సామాజిక మాధ్యమాల పోస్టల ద్వారా తెలుస్తోంది.
