అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Cp Nizamabad | నగరంలో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి పోలీసులు రావడంతో పారిపోయిన ముఠా కేసును పోలీసులు పదిరోజుల్లోనే ఛేదించారు. దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) కేసు వివరాలను వెల్లడించారు.
Cp Nizamabad | హరియాణాకు చెందిన ముఠా..
డిసెంబర్ 31న రాత్రి గుర్తు ఐదుగురు వ్యక్తులతో కూడిన ముఠా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంను (Punjab National Bank ATM) గ్యాస్ కట్టర్‌తో కాల్చి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు రాత్రి బ్లూకోల్ట్ విధులు నిర్వహించే పోలీసులను చూసి వారు పారిపోయారు. ఈమేరకు న్యాలకంటి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీపీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసును విచారించారు. సీసీ టీవీ పుటేజీ (CCTV footage), సాంకేతిక ఆధారాలతో కేసును పరిశోధించారు. ఈ క్రమంలో నేరస్తుల గురించి గాలిస్తుండగా.. 8న మధ్యాహ్నం నిఖిల్ సాయి ఎక్స్‌రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా.. బొలెరో వాహనంలో కర్రలు, రాళ్లు పెట్టుకొని వెళ్తున్న నేరస్తులను ఆపి విచారించగా నిందితులు పట్టుబడ్డారు.
Cp Nizamabad | హైదరాబాద్ యువకుడితో దోస్తీ చేసి..
హరియాణాకు చెందినా అబ్డుల్లా తన గ్యాంగ్ సభ్యులైన ఆసిఫ్, అర్షద్, అజ్మీర్‌తో 2018లో ఉదయ్‌పూర్‌లో ఏటీఎం కొల్లగొట్టి రూ.లక్షల్లో చోరీ చేశారు. అలాగే శివపురిలో ఏటీఎం ధ్వంసం చేసి అందులో నుంచి రూ.8 లక్షలు కొల్లగొట్టారు. ఈ కేసుల్లో వీరు జైలుకు వెళ్లారు. అయితే హైదరాబాద్‌కు చెందినా అమీర్ ఇన్‌స్టాలో మధ్యప్రదేశ్‌కు చెందిన అమ్మాయితో పరిచయం కాగా.. ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆమె మైనర్ అవడంతో పోక్సో కేసు నమోదైంది. ఈ క్రమంలో అతడిని శివపురిలో జైలుకు తరలించారు. అక్కడ అబ్దుల్లా గ్యాంగ్‌తో అమీర్‌కు పరిచయమైంది. దీంతో అతడు తెలంగాణాలోనూ ఏటీఎంలను చోరీ చేసే ప్లాన్‌ను వారికి వివరించాడు.
దీంతో అబ్దుల్లా గ్యాంగ్ జైలునుంచి విడుదలైన తర్వాత అమీర్‌తో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఏటీఎంలను కొల్లగొట్టేందుకు కావాల్సిన సిలిండర్, ఒక చిన్న ఎల్పీజీ సిలిండర్, గ్యాస్ కట్టర్, గ్లౌస్లు, నల్లటి రంగు స్ప్రే బాటిళ్లను కొనుగోలు చేశారు. జూలై 8న షాపూర్ నగర్ మార్కండేయ నగర్ రోడ్ పక్కన ఉన్న హెచ్డీఎఫ్సీ ఏటీఎంను కొల్లగొట్టారు. అందులో నుంచి రూ.30 లక్షల వరకు దొంగిలించి జీడిమెట్ల బస్‌డిపో వద్ద గ్యాస్ కట్టర్ సామాగ్రి పడేశారు. అదే గల్లీలో రెండు బైక్‌లు చోరీ చేసి కామారెడ్డికి వచ్చారు. అక్కడ బైక్‌లు వదిలేసి ఆదిలాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి హరియాణా పారిపోయారు. ఆ కేసులో అమీర్, అబిద్, అర్షద్‌లను పోలీస్ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అందులో అబ్దుల్లా దొరకలేదు.
Cp Nizamabad | బెయిల్‌పై వచ్చిన తర్వాత..
తర్వాత అమీర్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం ముఠా నాయకుడు అబ్దుల్లా మళ్లీ అమీర్‌తో కలిసి అమీర్, వాజీబ్, అబీద్, ఇక్రామ్లతో కొత్త గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి జహీరాబాద్‌కు వస్తూ మార్గమధ్యలో టోల్‌ప్లాజాకు కొద్ది దూరoలో ఒక కారు చోరీ చేసి అక్కడికి దగ్గరలో ఉన్న ఏటీఎంను ధ్వంస చేసే ప్రయత్నం చేయగా.. పోలీసులు రావడంతో పారిపోయారు. అక్కడి నుంచి డిచ్పల్లి చేరుకున్న చోరీముఠా అక్కడ భోజనం చేశారు.
గత నెల 31న రాత్రి నిజామాబాద్ నగరానికి వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను తెల్లవారుజామున కొల్లకొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం అర్గుల్ వద్ద ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమై అక్కడి నుంచి పారిపోయారు. మళ్లీ నిజామాబాద్ నగరంలో ఏటీఎంలు ధ్వంసం చేసేందుకు రెక్కీ నిర్వహిస్తుండగా.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి నుంచి వాహనం గ్యాస్ కట్టర్, సిలిండర్, కర్రలు, రాడ్లు, రాళ్లు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
