అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Mallanna | హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) సవాల్ విసిరారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్‌పై ఆయన స్పందించారు. సజ్జనార్‌కు (CP Sajjanar) దమ్ముంటే సైబర్ నేరాలను ఆపాలన్నారు. ఎంతో మంది చిన్నారులు కిడ్నాప్ అవుతున్నారని వాటిని ఆపాలని సవాల్ చేశారు.
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని (Immadi Ravi) హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ అనంతరం పలువురు సినీ ప్రముఖులతో కలిసి సజ్జనార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దమ్ముంటే పట్టుకోమని సవాల్ చేసిన ఐ బొమ్మ రవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా తీన్మార్ మల్లన్న స్పందించారు. సినిమా వాళ్లను పక్కన పెట్టుకొని సినిమా డైలాగులు చెప్పారని సజ్జనార్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLC Mallanna | ప్రజల నుంచి మద్దతు
ఐ బొమ్మ రవి (IBomma Ravi) దమ్మున్నొడు అని మల్లన్న అన్నారు. అందుకే ఆయనకు ప్రజల మద్దతు ఉందని చెప్పారు. రూ.వంద టికెట్‌ను వేలల్లో అమ్ముకుంటున్న సినిమా వాళ్లు ఏమన్నా సంసారులా అని ఆయన ప్రశ్నించారు. అలాంటి వారిని పక్కన పెట్టుకొని సినిమా డైలాగ్‌లు చెప్పడం కాదన్నారు. రవి భార్య చెబితే గాని పోలీసులు పట్టుకోలేకపోయారని విమర్శించారు. సజ్జనార్ చేసినవి అన్ని ఫేక్ ఎన్కౌంటర్లేనని ఆయన ఆరోపించారు. ఐబొమ్మ పోగానే.. ఐ బొమ్మ వన్ వచ్చిందన్నారు. పైరసీలు ఆగవని గతంలో సీవీ ఆనంద్ చెప్పారని గుర్తు చేశారు. సినిమా డైలాగ్‌లు చెప్పడం మాని సైబర్ క్రైమ్‌లు ఆపాలని ఆయన సూచించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
