అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hydraa | హైదరాబాద్ నగరంలోని (Hyderabad city) చెరువులకు పూర్వ వైభవం తీసుకు రావడానికి హైడ్రా చర్యలు చేపట్టింది. ఇప్పటికే అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను (Bathukamma Kunta) అభివృద్ధి చేసిన హైడ్రా కూకట్పల్లి నల్ల చెరువు పనులను వేగంగా చేపడుతోంది. తాజాగా మాధాపూర్, బోరబండ సరిహద్దులో ఉన్న సున్నం చెరువు పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ నగరంలో అనేక చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. అక్రమార్కుల కబ్జాలకు పలు చోట్ల కుంటలు, చెరువులు కనుమరుగు కాగా.. కొన్ని మురికి కుంటలుగా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో హైడ్రా చెరువులకు పూర్వ వైభవమే లక్ష్యంగా పనిచేస్తోంది. సున్నం చెరువు పునరుద్ధణ కోసం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తున్న ఆంజనేయ గుడితో పాటు.. ముస్లింల ప్రార్థనా స్థలం చిల్లా తరలింపునకు హైడ్రా (Hydraa) స్థానికులను ఒప్పించింది.
Hydraa | ప్రజలతో సమావేశం
సున్నం చెరువు పరిసర (Sunnam Cheruvu area) ప్రాంత ప్రజలతో శనివారం హైడ్రా సమావేశం ఏర్పాటు చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఆలయం, చిల్లా తరలింపునకు ప్రజలు సమ్మతి తెలిపారు. ఇవి ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తున్నందున వీటిని చెరువు గట్టువైపు తరలించాలని హైడ్రా భావించింది. వీటి తరలింపునకు సంబంధించిన అంశం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలకు చెందిన స్థానికులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) కార్యాలయంలో చర్చించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను వివరించారు. ఆంజనేయ విగ్రహంతో పాటు, చిల్లాను చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కాకుండా.. చెరువు గట్టు వైపు తరలించే విషయమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇరు పక్షాలకు చెందిన స్థానికులు అంగీకారం చెప్పడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది.
