అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad industrial areas | గ్రేటర్ హైదరాబాద్ లోపల కాలుష్యకారక, కాలం చెల్లిన పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) బయటకు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది.
బాలానగర్, జీడిమెట్ల, కాటేదాన్, కూకట్పల్లి, ఉప్పల్, చర్లపల్లి తదితర 22 పారిశ్రామిక వాడల్లోని భూములను ఇతర అవసరాలకు వినియోగించేలా కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్డీపీ)ని అమలు చేయనుంది.
ఈ మేరకు ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆయా ఇండస్ట్రియల్ ప్రాంతాల్లోని 9,292.53 ఎకరాల భూములను ఇతర అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టినవి ప్రాంతం (ప్లాటెడ్) 4,740.14 ఎకరాలు ఉన్నట్లు గుర్తించింది.
Hyderabad industrial areas | తరలింపు ఎందుకంటే..
హైదరాబాద్ మహానగరంలో 60 ఏళ్ల కిందట పరిశ్రమల కోసం భూములు కేటాయించారు. నాడు సిటీకి దూరంగా కేటాయించగా.. మహానగరం విస్తరించడంతో అవి కాస్త నేడు సిటీ మధ్యలోకి వచ్చేశాయి.
దీంతో జనావాసాల్లో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పరిశ్రమలన్నింటినీ ఓఆర్ఆర్ వెలుపలకు తరలించే ఏర్పాటు చేస్తోంది సర్కారు.
పరిశ్రమలను తరలించగా.. ఏర్పడే ఖాళీ భూముల్లో అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్స్, ఆఫీసులు, రిటైల్ కేంద్రాలు, హోటళ్ల లాంటి కమర్షియల్ కాంప్లెక్సులను ఏర్పాటు చేసుకోవడం..
కాలేజీలు, స్కూళ్లు, హాస్పిటళ్లు, రీసెర్చ్ కేంద్రాల వంటి విద్యా సంస్థల నిర్మాణం.. పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కల్చరల్ కేంద్రాల వంటి రీక్రియేషనల్ వసతుల కల్పన.. టెక్నాలజీ పార్కులు.. తదితర వాటికి వినియోగించాలని సర్కారు జారీ చేసిన జీవోలో స్పష్టం చేసింది.
