అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్ (Neknampur)లో ప్రభుత్వ భూమిని కాజేయాలని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంది. ప్రజావసరాలకు ఉద్దేశించిన 2700 గజాల స్థలాన్ని కాపాడింది. దీని విలు రూ. 54 కోట్ల వరకూ ఉంటుంది.
రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipet) మండలం నెక్నాంపూర్ గ్రామంలో 31వ సర్వే నంబరులో 59.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం 2002లో ఈ భూమిని కేటాయించింది. 2007లో హుడా లే అవుట్ కూడా వేశారు. లే అవుట్లో 2700 గజాల స్థలాన్ని పార్కుతో పాటు.. ప్రజావసరాలకు అప్పట్లో కేటాయించారు. గుట్టలా ఉండే ఈ స్థలంలో పార్కు ఏర్పాటు చేయలేదు. దీనిని ఆసరాగా చేసుకున్నా కబ్జాదారులు ఆ భూమిపై కన్నేశారు. ఆ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించడానికి యత్నించారు.
HYDRAA land protection | అక్రమ నిర్మాణం
సచివాలయ ఉద్యోగుల కాలనీకి ఆనుకుని సర్వే నంబరు 22లో వెంకటేశ్వర కాలనీ ఉంది. ఓ వ్యక్తి ఈ కాలనీలోని ప్లాట్‌ను చూపిస్తూ నిర్మాణ అనుమతి తెచ్చుకున్నాడు. సదరు వ్యక్తులు అనుమతి తెచ్చుకున్న ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణం ఉంది. అయితే దానిని చూపించి సచివాలయ ఉద్యోగుల కాలనీలోని పార్కుతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలంలో నిర్మాణాలు చేపట్టాడు. పునాదులతో పాటు.. పిల్లర్లు వేసి.. స్లాబ్ వేయడానికి సిద్ధమయ్యాడు. పార్కు స్థలం కబ్జాపై కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. ఈ మేరకు ఆక్రమణలను గురువారం తొలగించారు. అంతేగాకుండా గుట్టను ప్లాట్లుగా చేసి కొంతమంది అప్పటి ప్రతినిధులు అమ్మేసిన మరో 5 ప్లాట్లలో వేసిన తాత్కాలిక షెడ్డులను తొలగించారు. మొత్తం 2700 గజాల మేర స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
