HomeUncategorizedLiberian Ship | కొచ్చి తీరంలో హైఅల‌ర్ట్‌.. మునిగిపోయిన లైబీరియా నౌక‌

Liberian Ship | కొచ్చి తీరంలో హైఅల‌ర్ట్‌.. మునిగిపోయిన లైబీరియా నౌక‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Liberian Ship | లైబీరియాకు చెందిన ఓ బారీ నౌక కేర‌ళ స‌ముద్ర తీరానికి స‌మీపంలో మునిగిపోయింది. అందులో ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు ఉండ‌డంతో ఇండియ‌న్ కోస్ట్ గార్డు (ICG) హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

ఆదివారం తెల్లవారుజామున కొచ్చి(Kochi) తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియాకు చెందిన కంటైనర్ నౌక MSC ELSA 3 మునిగిపోయింది. అందులో 24 మందిని ఇండియ‌న్ కోస్ట్ గార్డు(Indian Coast Guard)తో పాటు నేవీకి చెందిన INS సుజాత ర‌క్షించాయి. నౌక‌లో 640 కంటైన‌ర్లు ఉండ‌గా, వాటిలో 13 కంటైన‌ర్ల‌లో ప్ర‌మాదక‌ర‌మైన ర‌సాయ‌నాలు, 12 కంటైన‌ర్ల‌లో కాల్షియం కార్బైడ్‌, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ ట‌న్నుల డీజిల్‌, 367.1 మెట్రిక్ ట‌న్నుల ఫ‌ర్నేస్ ఆయిల్ ఉన్న‌ట్లు (ICG) తెలిపింది.

ఈ ర‌సాయ‌నాలు లీకైతే స‌ముద్ర జ‌లాలు తీవ్రంగా క‌లుషిత‌మ‌య్యే ప్ర‌మాదం ఉండ‌డంతో ప్రతిస్పందన కార్యకలాపాల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ హై అలర్ట్(High Alert) ప్ర‌క‌టించింది. కంటైన‌ర్ల‌ను, అందులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఇంధ‌నం తీరం వైపున‌కు వస్తే తాకొద్ద‌ని కేర‌ళ విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ ప్ర‌జ‌ల‌కు సూచించింది. స‌ముద్ర జ‌లాల్లో ఇంధ‌నం లీకై ఎంత మేర‌కు వ్యాపించింద‌నేది తెలుసుకునేందుకు ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాల‌జీని వినియోగించే విమానం స‌ముద్రంపై చక్క‌ర్లు కొడుతోంద‌ని అధికారులు తెలిపారు.

Liberian Ship | స‌హాయ‌క చ‌ర్య‌లు..

విజింజమ్ పోర్టు నుంచి శుక్ర‌వారం బ‌య‌ల్దేరిన లైబీరియాకు చెందిన నౌక ఎంఎస్‌సీ ఎల్సా-3(MSC Elsa-3) శ‌నివారం మ‌ధ్యాహ్నానికి కొచ్చికి చేరుకోవాల్సింది. కానీ కంటైనర్ నౌక కేర‌ళ స‌ముద్ర తీరానికి 38 నాటిక‌ల్ మైళ్ల దూరంలో ఓ వైపు ఒరిగిపోయింది. దీంతో అందులోని కొన్ని కంటైన‌ర్లు స‌ముద్రంలో ప‌డిపోయాయి. ఇది గ‌మ‌నించిన ఇండియ‌న్ కోస్ట్ గార్డు(Indian Coast Guard).. వెంట‌నే స‌హాయ‌క చర్య‌లు చేప‌ట్టింది.

నౌక‌లోని 24 మంది సిబ్బందిలో 21 మందిని తొలుత రక్షించారు. గ‌ల్లంతైన మిగిలిన ముగ్గురిని కూడా సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. నౌక‌ సిబ్బందిలో ఒక రష్యన్ (ఓడ మాస్టర్), 20 మంది ఫిలిప్పీన్స్, ఇద్దరు ఉక్రేనియన్లు, ఒక జార్జియన్ జాతీయుడు ఉన్నారు. మ‌రోవైపు, స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనేందుకు మాతృ షిప్పింగ్ కంపెనీకి చెందిన మరొక నౌక సంఘటనా స్థలానికి చేరుకుందని ర‌క్ష‌ణ శాఖ వెల్ల‌డించింది. కోస్ట్ గార్డ్ నౌకలు, విమానాలు రెండూ ప్ర‌మాద‌ సమీపంలోనే ఉండి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.