అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Haryana | హర్యానా (Haryana) రాష్ట్రంలోని నూహ్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుక హింసాకాండకు దారితీసింది. స్టేజ్‌పై నృత్య ప్రదర్శన ఇస్తున్న మహిళా కళాకారిణిపై వరుడి బంధువులు దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 16న పచ్‌గావ్ గ్రామంలో (Pachgaon Village) జరిగిన ఈ ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఘటనపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సమాచారం ప్రకారం.. డ్యాన్స్ చేస్తున్న ఒక కళాకారిణి దగ్గరకు వరుడి బంధువు డబ్బులు ఇస్తున్నట్లు నటిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ప్రవర్తనకు ఆమె వెంటనే అతని చేతిని పక్కకు నెట్టింది. దీనిని అవమానంగా భావించిన ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆగ్రహించి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.
Haryana | స్టేజ్‌పై దారుణ దాడి
ఘటన అక్కడితో ఆగలేదు. మరికొందరు వ్యక్తులు కూడా స్టేజ్‌పైకి చేరుకుని ఆ డ్యాన్సర్‌ను కింద పడేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తోటి కళాకారులపై కూడా దాడి చేశారు. ఆ మహిళా డ్యాన్సర్ (Female Dancer) ప్రాణాలు ప్రమాదంలో పడిన పరిస్థితి కనిపించడంతో, ఆమె బృందంలోని సభ్యులు, అక్కడున్న మహిళలు ముందుకు వచ్చి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించినా.. ఇప్పటికీ కేసు నమోదు కాలేదని తెలిపారు. అయితే, ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు.
ఈ సంఘటనపై డ్యాన్స్ కమ్యూనిటీ (Dance Community) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నూహ్‌కు చెందిన కళాకారుడు బిల్లీ మాట్లాడుతూ..“కళాకారులను కించపరచకండి. వారు కూడా ఒకరి సోదరీమణులు, కుమార్తెలే. ఇలా అవమానించడం దురదృష్టం” అని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో డ్యాన్సర్ రేణు జంగ్రా మాట్లాడుతూ.. పొట్టకూటి కోసం స్టేజ్‌పైకి వచ్చి ప్రదర్శన ఇస్తాం. కానీ మా ఆత్మగౌరవం చెదరగొట్టే హక్కు ఎవరికీ లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో (Social Media) భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా కళాకారిణిపై ఇలా దాడి చేయడం దారుణమని నెటిజన్లు అంటున్నారు. పెళ్లి వేడుకల పేరుతో మహిళలను అవమానించే వ్యవహారాన్ని తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
