అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Minister Vivek | వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జి.వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy), రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali ) తెలిపారు. నిజామాబాద్‌లోని నూతన అంబేద్కర్ భవన్‌లో జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాలల హక్కులు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వల్లే మనకు ఈ రాజకీయ అధికారం దక్కిందని వివరించారు. ఈ అధికారాన్ని మన కుటుంబాల కోసమే కాకుండా, సమాజం కోసం వాడాలని సూచించారు.
Minister Vivek | ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి
గ్రామాల్లో పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేస్తానని మంత్రి తెలిపారు. డ్రెయినేజీలు, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేయాలన్నారు. చదువు ఒక్కటే మన జీవితాలను మారుస్తుందని వివరించారు. గ్రామాల్లోని దళిత బిడ్డలు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న విదేశీ విద్యా నిధి వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
Minister Vivek | జిల్లా అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ముఖ్యం
నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అవసరమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు గ్రామ అభివృద్ధికి వెన్నెముక అని తెలిపారు. మీకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు మాల సామాజిక వర్గం ఎంతో కృషి చేసిందన్నారు. నిజామాబాద్ నగరంలో జి.వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా పేరును వెంకటస్వామి గారి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు.
కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చిన్నయ్య, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దేవిదాస్, లింబాద్రి, టీఎన్జీవో నాయకులు కిషన్ తదితరులు పాల్గొన్నారు.