అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees | తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా (Accident Insurance)ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka Mallu) పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు భట్టి చెప్పుకొచ్చారు. సర్కారు ఉద్యోగులకు ప్రమాద బీమాను అందించేందుకు బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.
Govt Employees | ఇప్పటికే..
ట్రాన్స్కో, సింగరేణి, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఉద్యోగులకు రూ.కోటికి పైగా ప్రమాద బీమాను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు భట్టి తెలిపారు. తద్వారా సింగరేణిలో 38,000 మంది ఉద్యోగులు, విద్యుత్ సంస్థల్లోని 71,387 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. తద్వారా సుమారు 5.14 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది కలగనుందన్నారు.