Homeఆంధప్రదేశ్Vijayawada | విజయవాడలో కూడా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ మ్యాచ్‌లు.. ఆ స్టేడియానికి మెగా మార్పులు

Vijayawada | విజయవాడలో కూడా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ మ్యాచ్‌లు.. ఆ స్టేడియానికి మెగా మార్పులు

భారీ ఆధునికీకరణ పూర్తయిన తర్వాత, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాకుండా, దేశంలో అత్యాధునిక క్రీడా ప్రాంగణాల్లో ఒకటిగా నిలవనుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijayawada | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) క్రీడా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలను (International Level Sports) నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందించింది.

ఈ క్రమంలో కొత్త క్రీడా ప్రాంగణాల నిర్మాణంతో పాటు పాత స్టేడియాలను ఆధునికీకరించే పనులు వేగవంతం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా, విజయవాడ నగరంలో కీలకంగా గుర్తింపు పొందిన ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంను (Indira Gandhi Municipal Stadium) ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Vijayawada | 2029లో అంతర్జాతీయ క్రీడల నిర్వహణ లక్ష్యం

స్టేడియం పునర్నిర్మాణ పనులు 2026 సంవత్సరం చివరి నాటికి పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆధునికీకరణ అనంతరం, 2029లో అంతర్జాతీయ స్థాయి క్రీడలను విజయవాడలో (Vijayawada) నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) కలిసి నిర్వహించనున్నాయి. ఈ అభివృద్ధి పనులకు మొత్తం రూ.53 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేయగా, తొలి విడతగా రూ.30 కోట్లు విడుదల చేసి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర డీపీఆర్‌ను (DPR) ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

భవిష్యత్తులో స్టేడియంలో క్రీడేతర కార్యక్రమాలకు పూర్తిగా నిషేధం విధించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టేడియంను పూర్తిగా క్రీడా కార్యక్రమాలకు మాత్రమే వినియోగించేలా మార్చనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని అత్యాధునిక క్రీడా కేంద్రంగా మార్చేందుకు పలు నిర్మాణాత్మక మార్పులు ప్రతిపాదించారు. కొత్త నిర్మాణాలు, మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ హాల్, బాక్సింగ్ ప్రాక్టీస్ అరేణా, ఆధునిక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కమర్షియల్ హాల్, ప్రస్తుతం స్టేడియంలో ఉన్న శాప్ ప్రధాన కార్యాలయాన్ని తొలగించి ఈ భవనాలను నిర్మించాలని యోచిస్తున్నారు. ప్రస్తుత 3 సింథటిక్ టెన్నిస్ కోర్టులకు అదనంగా 2 కొత్త టెన్నిస్ కోర్టులు, 2 వాలీబాల్ కోర్టులు, 2 బాస్కెట్‌బాల్ కోర్టులు, 2 కబడ్డీ కోర్టులు అలాగే క్రీడాకారుల సాధన కోసం క్రికెట్ నెట్ కూడా ఏర్పాటు చేయనున్నారు.