అక్షరటుడే, కామారెడ్డి: BJP Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన కోసం ఒకసారి తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ మాజీ కౌన్సిలర్లు పట్టణ ఓటర్లను కోరారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల అభివృద్ధి చేసి రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
BJP Kamareddy | గత పాలనలో అనేక భూకబ్జాలు..
గత బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అనేక భూకబ్జాలు జరిగాయని బాధితులు గగ్గోలు పెట్టారన్నారని బీజేపీ మాజీ కౌన్సిలర్లు అన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రజాదర్బార్ పెడితే 5వేల దరఖాస్తులు వచ్చాయంటే భూ కబ్జాలు ఎన్ని జరిగాయో అర్థమవుతుందన్నారు. ఇంకా తమ వద్దకు రాని వాళ్లు చాలామంది ఉన్నారని తెలిపారు. అవినీతి రహిత పాలన కోసం ఎమ్మెల్యేగా వెంకట రమణారెడ్డి (MLA Venkata Ramana Reddy) తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. అలాగే అవినీతి రహిత, కబ్జాలు లేని కామారెడ్డి కోసం మున్సిపాలిటీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. గత పాలకవర్గంలో బీజేపీ నుంచి గెలిచిన ఒక్క కౌన్సిలర్ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పని చేశారన్నారు.
BJP Kamareddy | రెండేళ్లలో అవినీతితో పోరాటం..
తమ నాయకుడు వెంకట రమణారెడ్డి గెలిచిన రెండేళ్లలో మున్సిపాలిటీలో (Kamareddy Municipality) అవినీతి జరగకుండా చూశారని బీజేపీ నాయకులు అన్నారు. ప్రస్తుతం ఎలాంటి అవినీతి, భూ కబ్జాలు లేకుండా ప్రజలు ప్రశాంతంగా గుండెమీద చేయి వేసుకుని ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు సృష్టిస్తోందని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి డబ్బున్న వాళ్లు ప్రజలకు నోట్లను ఎరగా వేసి, మద్యం ఆశ చూపి గెలవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అలాంటి వాళ్లు తిరిగి డబ్బు సంపాదన కోసమే అడ్డదారులు తొక్కుతారని తెలిపారు. బీజేపీ నుంచి సాదాసీదా వ్యక్తులే పోటీలో ఉంటారని తెలిపారు.
BJP Kamareddy | భూ కబ్జాలు కావాలా.. అవినీతి లేని అభివృద్ధి కావాలా..
భూ కబ్జాలు కావాలా.. అవినీతి లేని అభివృద్ధి కావాలా.. అనేది పట్టణ ప్రజలు ఆలోచించాలని నాయకులు కోరారు. మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని ఆధారాలు చూపించినా అధికారులు పట్టించుకోలేదని బీజేపీ మాజీ కౌన్సిలర్లు అన్నారు. ఎలాంటి సవరణలు చేయకుండా తిరిగి అదే జాబితాను ఇచ్చారన్నారు.
BJP Kamareddy | 12న మున్సిపల్ ముట్టడి..
కామారెడ్డి మున్సిపాలిటీలో ఇళ్లపైనే కాకుండా షట్టర్లు, షాపింగ్ మాల్స్, లాడ్జీలపై వందల ఓట్లు ఉన్నాయన్నారు. ఓటరు జాబితా తప్పులపై, అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం మున్సిపల్ ముట్టడి చేపట్టనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రతి బీజేపీ కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్లు ఆకుల సుజిత, మానస, నరేందర్, శ్రీనివాస్, నాయకులు ఆకుల భరత్ తదితరులు పాల్గొన్నారు.