అక్షరటుడే, వెబ్డెస్క్ : GHMC | అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ సంస్థలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు (Trade License Fee) తక్కువ చెల్లిస్తున్నట్లు గుర్తించి గురువారం నోటీసులు జారీ చేశారు.
రెండు స్టూడియోల నిర్వాహకులు వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) లక్షా 92 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తున్నారు. అయితే 8,100 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తున్నట్లు అధికారులకు చెబుతున్నారు. రూ.11.52 లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండగా.. రూ.49వేలు మాత్రమే కడుతున్నారు.
GHMC | రామానాయుడు స్టూడియోస్
రామానాయుడు స్టూడియోస్ (Ramanaidu Studios) 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తోంది. కానీ 1900 చ.అడుగులకు మాత్రమే ట్రేడ్ పన్ను కడుతున్నారు. సదరు సంస్త మొత్తం రూ.2.73 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. రూ.7,600 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ (GHMC) ఆదాయనికి భారీగా గండి పడుతోంది. ఏళ్లుగా వీరు అధికారులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తుండటం గమనార్హం. తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అని హెచ్చరించారు.
GHMC | ఐ బొమ్మ రవి విషయంలో అలా..
హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ఇటీవల ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ (CP Sajjanar)తో అన్నపూర్ణ స్టూడియో అధినేత నాగార్జున, రామానాయుడు స్టూడియో అధినేత దగ్గుబాటి సురేశ్ బాబు హాజరయ్యారు. పైరసీతో ఇమ్మడి రవి తెలుగు చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించారని వారు పేర్కొన్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా.. ఆ రెండు స్టూడియోలు నిర్వహించే వీరు మాత్రం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. తమ ఆదాయానికి నష్టం చేశారని ఇమ్మడి రవిపై గగ్గొలు పెట్టిన వీరు.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం గమనార్హం. స్టూడియోల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తూ.. పూర్తిస్థాయి పన్ను చెల్లించుకుండా తప్పించుకుంటున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానా విధించాలని ప్రజలు కోరుతున్నారు.
