అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Blast | ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు వేగంగా సాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా మరిన్ని అనుమానాస్పద ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం హర్యానా ఫరీదాబాద్ (Faridabad)లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఘటన పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ (Al Falah University)కి చెందిన డాక్టర్ల స్థలాల్లో ఈ భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు లభించాయి. ఈ నేపథ్యంలో దేశ భద్రతా ఏజెన్సీలు, ఫోరెన్సిక్ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి.
Delhi Blast | అల్మోరాలో 161 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
తాజాగా హర్యానా (Haryana)కు పొరుగున ఉన్న అల్మోరా జిల్లాలో మరో ఘటన ఆందోళన కలిగించింది. సాల్ట్ ప్రాంతంలోని రెండు పాఠశాలల సమీపంలోని పొదల్లో 20 కిలోలకు పైగా బరువున్న 161 జిలెటిన్ స్టిక్స్ దొరికాయి. క్రికెట్ బాల్ కోసం వెతుకుతున్న విద్యార్థులు ఇవి గుర్తించడంతో పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం అల్మోరా మొత్తం జిల్లాలో అలర్ట్ ప్రకటించారు. పోలీసులు (Delhi Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శాంపిళ్లు సేకరించి, ఈ స్టిక్స్‌ను ఎవరు, ఎందుకోసం అక్కడ పెట్టారన్న కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. గ్రామ సర్పంచ్ అర్జున్ సింగ్ మాట్లాడుతూ.. గతేడాది రోడ్డు ప్రాజెక్టుపై పనిచేసిన కార్మికులు రాయిని పగలగొట్టడానికి తెచ్చి వదిలి ఉండవచ్చు అని తెలిపారు. అయితే, పోలీసులు మాత్రం ఎలాంటి అవకాశాన్నీ వదలకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) వద్ద జరిగిన కారు పేలుడుకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ (Jaish-e-Mohammed Terrorist Organization)కు మద్దతుగా ఉన్న వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తేలింది.ప్రధాన నిందితుడు డాక్టర్ ముజామ్మిల్ షకీల్, 2023 నుంచే ఈ కుట్రపై పనిచేస్తున్నట్టు విచారణలో వెల్లడించాడు. రెండేళ్లుగా పేలుడు పదార్థాలు, బాంబుల కోసం అవసరమైన ఎలక్ట్రానిక్ ఐటమ్స్, రిమోట్లు సేకరించాడని తెలిపాడు. ముజామ్మిల్‌కు పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన రసాయనాలను సేకరించే బాధ్యత అప్పగించబడినట్టు దర్యాప్తులో తేలింది. రూ. 3 లక్షల విలువైన 26 క్వింటాళ్ల నైట్రోజన్–ఫాస్ఫేట్–పొటాషియం ఫర్టిలైజర్లు, అమ్మోనియం నైట్రేట్, యూరియా ఇవన్నీ గురుగ్రామ్, నూహ్ ప్రాంతాల్లో కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ రసాయనాలను నిర్దిష్ట ఉష్ణోగ్రతలో నిల్వచేయడానికి ముజామ్మిల్ డీప్ ఫ్రీజర్ కూడా కొనుగోలు చేసినట్టు తెలిపాడు.
