అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fake Jobs Scam | ఐటీ కంపెనీల్లో (IT companies) ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాక్‌డోర్ జాబ్స్ పేరిట ఈ గ్యాంగ్ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
సైబరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులు (Cyberabad Cyber Crime police) నకిలీ ఉద్యోగాలతో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో (MNC companies) ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసేవారు అనంతరం నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చేవారు. అంతేగాకుండా నకిలీ ఆఫీసులను పెట్టి.. పని చేయించుకునేవారు. తీరా జీతం ఇవ్వకుండా.. వారిని తొలగించేవారు.
Fake Jobs Scam | ఇలా దొరికారు..
హైదరాబాద్‌కు చెందిన గూడపాటి శ్రీకాంత్ స్వరూప్ నాయుడు (32) ఉద్యోగం కోసం సెర్చ్ చేసేవాడు. ఈ క్రమంలో అతడికి ఓ మహిళా వాట్సాప్‌లో మెసెజ్ పంపింది. తాను ఉద్యోగ సలహాదారుగా పేర్కొంటూ, ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చింది. ఉద్యోగం కోసం రూ.3.20 లక్షలు ఇవ్వాలని చెప్పింది. దీంతో శ్రీకాంత్ యూపీఐ ద్వారా ఆమె చెప్పిన ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం అతడికి జెన్‌ప్యాక్ట్ ఎన్‌క్వెరో అనే నకిలీ ఆఫర్ లెటర్ వచ్చింది.
Fake Jobs Scam | నకిలీ ఆఫీసులు పెట్టేశారు
నిందితులు నకిలీ ఆఫీసులను కూడా పెట్టేశారు. ఆఫర్ లెటర్లో వచ్చిన అడ్రస్‌కు వెళ్లి శ్రీకాంత్ ఉద్యోగంలో చేరాడు. అయితే అతడికి జీతం ఇవ్వలేదు. దీనిపై ప్రశ్నించడంతో ఉద్యోగంలోకి తొలగిస్తున్నట్లు చెప్పారు. అంతేగాకుంగా ఆయన కట్టిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంకేతిక విశ్లేషణ, మొబైల్ లొకేషన్ ట్రాకింగ్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉప్పల వెంకట సాయి రామ్, జల్లి కార్తీక్, వినుకొండ శ్రీకాంత్ అలియాస్ మనోజ్, గురిందపల్లి ప్రియాంక అలియాస్ శ్రేయ అలియాస్ రమ్యశ్రీ, హెచ్‌ఏ రమేష్ అలియాస్ మధును అదుపులోకి తీసుకున్నారు.
ఈ నిందితులు ప్రముఖ కంపెనీల మాదిరిగానే నకిలీ ఇమెయిల్ ఐడీలు, డొమైన్‌లను సృష్టించారు. ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నకిలీ ఆఫర్ లెటర్‌లు జారీ చేశారు. నకిలీ శిక్షణ తరగతులు సైతం ఏర్పాటు చేశారు. బ్యాక్ డోర్ జాబ్ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారు. వీరి చేతిలో వందలాది మంది మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.