Homeతాజావార్తలుSarpanch Elections | పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. త్వరలో షెడ్యూల్​

Sarpanch Elections | పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. త్వరలో షెడ్యూల్​

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో షెడ్యూల్​ విడదల చేసి, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sarpanch Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. త్వరలో షెడ్యూల్​ విడుదల చేసి డిసెంబర్​లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికల నోటిఫికేషన్​ (Election Notification) జారీ చేయనుంది.

గ్రామాల్లో సర్పంచులు లేక పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు నిధులు లేవని చేతులు ఎత్తేస్తున్నారు. ప్రత్యేకాధికారులు ఉన్నా.. వారు గ్రామాలను సందర్శించి లేదు. దీంతో పంచాయతీ ఎన్నికల కోసం ప్రజలు కొన్ని నెలలుగా నిరీక్షిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం ఎటు తేలకపోవడంతో ఇన్ని రోజులు ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వం.. ఎట్టకేలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచ్​ ఎన్నికలు (Sarpanch Elections) పెడతామని ప్రకటించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Sarpanch Elections | డెడికేషన్​ కమిషన్​ నివేదిక

పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. 50 శాతం మించకుండా పంచాయతీలు, వార్డులవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు కమిషన్ సిఫారసు చేసింది. దీని ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఈ నెల 24న బీసీ రిజర్వేషన్లు (BC Reservations), స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ ఉంది. ఆ లోపు రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ నెల 25 లేదా 26న పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్​ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Sarpanch Elections | మూడు దశల్లో..

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) మూడు దశల్లో నిర్వహిస్తారని సమాచారం. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్​ఎస్​ హయాంలో తీసుకు వచ్చినట్లు బీసీలకు 27శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల చేయనున్నారు. అయితే కాంగ్రెస్​ మాత్రం 42 శాతం టికెట్లను పార్టీ పరంగా బీసీలకు కేటాయిస్తామని ప్రకటించింది. దీంతో మిగతా పార్టీలు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. అయితే గ్రామాల రిజర్వేషన్లకు సంబంధించి ఈ 24న రిజర్వేషన్ల రోస్టర్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్​ విడుదల చేస్తారని సమాచారం. డిసెంబర్​లో ప్రజాపాలన వారోత్సవాలు ముగిసిన అనంతరం ఎన్నికలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.