HomeతెలంగాణVemulawada Temple | వేములవాడ ఆలయంలో ఉద్యోగుల బదిలీలు

Vemulawada Temple | వేములవాడ ఆలయంలో ఉద్యోగుల బదిలీలు

వేములవాడ ఆలయం పరిధిలోని 17 మంది ఉద్యోగులను ఈవో బదిలీ చేశారు. ప్రసాదం గోదాం నుంచి సరుకులు మాయం చేసిన ఉద్యోగిని సైతం బదిలీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vemulawada Temple | వేములవాడ ఆలయ (Vemulawada Temple) ఉద్యోగులకు ఈవో షాక్​ ఇచ్చారు. పలువురు ఉద్యోగులను బదిలీ చేశారు. 17 మంది ఆలయ ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ ఈవో రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

రాజన్న ఆలయం (Rajanna Temple)లో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఏఈవో (AEO)లు, నలుగురు సూపరింటెండెంట్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక రికార్డ్ అసిస్టెంట్, ఒక అటెండర్​ను ఈవో బదిలీ చేశారు. ప్రసాదం గోదాంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటప్రసాద్ రాజును అంతర్గత బదిలీతో సరిపెట్టడం గమనార్హం.

Vemulawada Temple | ప్రసాదం గోదాంలో సరుకులు మాయం

ఆలయంలోని సెంట్రల్​ గోదాం, అనుబంధ, దత్తత ఆలయాలకు సూపంరింటెండెంట్​గా పని చేస్తున్న వెంకట ప్రసాద్​రాజుపై ఇటీవల అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రసాదం గోదాంలో సరుకులు మాయం చేశారని వార్తలు వచ్చాయి. ఈ అంశంపై ప్రత్యేక కమిటీ (Special Committee) ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. 14 రకాల ప్రసాద పదార్థాలు మాయం అయినట్లు ఆ కమిటీ నివేదికలో తెలిపింది. నువ్వులు, జీలకర్ర, మినపప్పు, కిస్మిస్, కాజు, యాలకులు, జెమినీ ఛాయపొడి, బఠాణీలు, జాజికాయ, పచ్చకర్పూరం, అల్సింత కాయ, ఉలువలు, పల్లీలు, దొడ్డు శనగలను గోదాం నుంచి అక్రమంగా తీసుకు వెళ్లినట్లు గుర్తించింది. అక్రమాలు నిజమేనని విచారణ కమిటీ (Inquiry Committee) స్పష్టం చేసినా.. సదరు ఉద్యోగిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అంతర్గత బదిలీతో సరిపెట్టారు. సెంట్రల్​ గోదాం విధుల నుంచి తప్పించి అనుబంధ, దత్తత ఆలయాల సూపరింటెండెంట్​గా నియమించారు. ఈవో తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద వస్తువులను మాయం చేసిన అధికారిని సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

Vemulawada Temple | అనుమానాస్పద స్థితిలో కార్మికుడి మృతి

గోదాంలో సరుకులు వెంకటప్రసాద్ రాజు కారులో పెట్టిన వ్యక్తి బుధవారం అర్ధరాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందటం కలకలం రేపింది. వేములవాడలోని పోచమ్మ ఆలయం (Pochamma Temple) లో దినసరి కార్మికుడు గోవింద్ అభినవ్ (25) పని చేస్తున్నాడు. రాజన్న ఆలయంలోని గోదాం నుంచి సరుకుల తరలింపు వ్యవహారంలో గోవింద్ కీలకంగా ఉన్నాడు. వెంకట ప్రసాద్​ కారులో అభినవ్ స్వయంగా గోదాంలోని సరుకులను పెట్టాడు. అయితే అర్ధరాత్రి సమయంలో బైక్​పై వెళ్తు మురికి కాల్వలోకి పడి ఆయన మృతి చెందాడు. దీనిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.