అక్షరటుడే, వెబ్‌డెస్క్: Local Body Elections | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందడి మళ్లీ మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు (Gram Panchayat elections) నిర్వహించడానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల సంఘం సైతం కసరత్తు ప్రారంభించింది. తాజాగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పంచాయతీ ఎన్నికలకు ముందే గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలను సరిదిద్దడానికి, తిరిగి ప్రచురించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) సూచనలను జారీ చేసింది. ఈ నెల 20న వార్డ్, జీపీ మ్యాపింగ్‌పై (GP mapping) అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాలి. 22న అభ్యంతరాల తొలగింపు చేపట్టి, 23న ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాల మళ్లీ ప్రచురించాలి. కాగా గతంలో ఎన్నికల సంఘం పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిలకు (MPTC and ZPTC elections) సంబంధించి ఓటర్ల జాబితాను ప్రచురించింది. అయితే మరోసారి దానిని ప్రచురించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Local Body Elections | డిసెంబర్లో ఎన్నికలు
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంది. దీనికి త్వరలోనే షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ తొలి వారంలో ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం ఎన్నికలు పెట్టనున్నారు. దీంతో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ముందు నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. అయితే కోర్టు బీసీ రిజర్వేషన్ల జీవోపై (BC reservation order) స్టే ఇవ్వడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మళ్లీ కొత్తగా షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి కూడా పోటీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అలాగే పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యాయి. గ్రామాల్లో సర్పంచులు లేక రెండేళ్లు దగ్గరకు వస్తోంది. దీంతో నిధులు లేక పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యం అయితే 15వ ఆర్థిక సంఘం (Finance Commission) నిధులు రావని భావించిన ప్రభుత్వం తొలుత జీపీల ఎన్నికలు పెట్టాలని నిర్ణయించింది.
