అక్షరటుడే, హైదరాబాద్: Eagle Team raids | తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ కోరలు చాస్తోంది. ఎక్కడ చూసినా గంజాయి, మత్తు పదార్థాల కేసులే వెలుగుచూస్తున్నాయి.
ఈ మహానగరంలోని యువత మత్తు పదార్థాలకు బానిసగా మారుతోంది. ముఖ్యంగా టీనేజీ యువతీయువకులు గంజాయి మత్తులో జోగుతున్నారు.
గత ఆగస్టులో హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ వినియోగం కలకలం రేపింది. ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఏకంగా 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
రెండు నెలల క్రితం గచ్చిబౌలిలో వెలుగు చూసిన మరో డ్రగ్స్ కేసులో మొత్తం ఇంటర్ విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగించింది. ఈ కేసులో దొరికిన విద్యార్థిని, విద్యార్థులంతా కూకట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్ పరిధిలోని వారే కావడం గమనార్హం.
Eagle Team raids | గతంలోనూ కేసులు..
తాజాగా మరో డ్రగ్స్ కేసు వెలుగుచూసింది. ఈ కేసులోనూ దొరికిన వారంతా విద్యార్థులే కావడం ఆందోళన కరం. బేగంపేటలోని ఓ హోటల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ఈగల్ టీమ్ దాడులు చేపట్టింది.
ఈ విద్యాసంస్థలో ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఇక్కడి విద్యార్థులు విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించి పోలీసులు షాక్ అయ్యారు.
విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. 11 మందికి గంజాయి, డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు ఆరుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ ఇదే ఇనిస్టిట్యూట్‌లో డ్రగ్స్ కేసులు వెలుగుచూడటం గమనార్హం.
