అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi car bomb case | ఢిల్లీలో ఇటీవల జరిగిన కారు బాంబు Car Bomb దాడి కేసు దర్యాప్తు వేగం పెరిగింది. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌తో కలిసి పనిచేసిన ఉగ్రవాదులు ఈ దాడికి ప్లాన్ వేసినట్లు అధికారులు వెల్లడించారు.
డ్రోన్‌లను ఆయుధాల్లా మార్చడం, చిన్న రాకెట్లు తయారు చేయడం, హమాస్ తరహా దాడులు నిర్వహించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన డ్రోన్, గ్లైడర్ దాడులను అనుకరించేలా ఇక్కడ కూడా ప్లాన్‌లు రూపొందినట్లు తెలుస్తోంది.
Delhi car bomb case | రెండో అనుమానితుడి అరెస్ట్
ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత ఎన్‌ఐఏ NIA మొదటి అనుమానితుడు ఆమిర్ రషీద్ అలీని అరెస్ట్ చేసింది. ఇప్పుడు రెండో అనుమానితుడు జాసిర్ బిలాల్ వాని అలియాస్ దానిశ్‌ను శ్రీనగర్‌లో అదుపులోకి తీసుకుంది.
వీరిద్దరూ జమ్మూకశ్మీర్‌కు చెందినవారే. దర్యాప్తు అధికారుల ప్రకారం.. దానిశ్ ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీతో నేరుగా పనిచేశాడు. ఈ వైట్ కాలర్ మాడ్యూల్‌కు టెక్నికల్ సపోర్ట్ అందించిన వ్యక్తుల్లో దానిశ్ ఒకడని ఎన్‌ఐఏ వెల్లడించింది.
ఎన్‌ఐఏ తెలిపిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దానిశ్ పెద్ద బ్యాటరీలను అమర్చి, బరువైన పేలుడు పదార్థాలను మోసేలా డ్రోన్‌ల రూపురేఖలను మార్చేందుకు ప్రయత్నించాడు.
చిన్న డ్రోన్‌లు Drones తయారు చేసిన అనుభవం అతనికి ఉంది. ఈసారి భారీ డ్రోన్‌లను నిర్మించి, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాటిని పేల్చేలా ప్లాన్ చేశాడు. ఇది పెద్దస్థాయి ప్రాణనష్టం కలిగించే ‘హమాస్ స్టైల్’ దాడి అయ్యేదని అధికారులు చెబుతున్నారు.
రాకెట్ తయారీ యత్నాలు కూడా బయటపడ్డాయి. డ్రోన్‌లతో పాటు, చిన్న రాకెట్లు తయారు చేయడం, వాటిని కస్టమ్ మోడిఫికేషన్‌లతో దాడులకు సిద్ధం చేయడం వంటి చర్యలు కూడా చేపట్టారని నిర్ధారించబడింది.
ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దేశవ్యాప్తంగా సెక్యూరిటీ ఏజెన్సీలు హై అలర్ట్ ప్రకటించాయి. యాంటీ డ్రోన్ సిస్టమ్‌లు, డ్రోన్ జ్యామర్లు, హెచ్చరిక వ్యవస్థలను నగరాల్లో పెంచుతున్నారు.
డ్రోన్‌లను ఉగ్రవాదులు ఆయుధాలుగా మార్చే ప్రయత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత్ భారీ స్థాయిలో యాంటీ డ్రోన్ మోహరింపునకు సిద్ధమవుతోంది.
