అక్షరటుడే, కామారెడ్డి : CPI Kamareddy | సీపీఐ సీనియర్ నాయకుడు వీఎల్ నర్సింహారెడ్డి సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా నర్సింహారెడ్డి (VL Narasimha Reddy) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
రెండు రోజుల క్రితం కామారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిలో (Kamareddy Private Hospital) చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందారు.
CPI Kamareddy | సీనియర్ న్యాయవాదిగా..
సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతూ సీపీఐలో (CPI Party) కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా నర్సింహారెడ్డి పనిచేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిరుపేదల కోసం, కార్మికవర్గ సంక్షేమానికి 40 ఏళ్లుగా నిరంతరం తపనపడ్డారు. సీపీఐ కామారెడ్డి జిల్లా (Kamareddy District) కార్యదర్శిగా, ఏఐటీయూసీ రాష్ట్ర సీనియర్ నాయకులుగా ఆయన సేవలందించారు.
CPI Kamareddy | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రంగాచారి కాలనీ, కామారెడ్డిలో పనిహారం రంగాచారి కాలనీ పేరుతో హమాలీలకు ఇళ్ల స్థలాలు, బతుకమ్మ కుంటలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలను ప్రజా ఉద్యమాల ద్వారా సాధించారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం నిర్వహించారు. నమ్మిన సిద్ధాంతాలను కట్టుబడి చివరి శ్వాస వరకు అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని నిస్వార్ధంగా పనిచేసిన వ్యక్తి అని పార్టీ నాయకులు, కార్మికులు, న్యాయవాదులు పేర్కొన్నారు. పోరాటాల ద్వారా ఏదైనా సాధించుకోవచ్చని తన ఆచరణలో నిరూపించారని తెలిపారు. ఎన్నో ప్రజా సమస్యలపై గళమెత్తి ఎంతటి వారైనా సరే వారిని నిలదీసే గొప్ప వ్యక్తిత్వం నరసింహారెడ్డిది అని అన్నారు.
డిగ్రీ కళాశాల ఆస్తుల సాధన కోసం, క్లబ్ భవనాన్ని ప్రభుత్వ పరం చేసిన ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం, మహిళా సమస్యలపై పోరాటాల్లో కలిసి పనిచేశారని గుర్తు చేసుకున్నారు. న్యాయవాదుల సమస్యల కోసం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందుండి నడిపించారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తాను పనిచేసే పార్టీని నిలదీసి, తీర్మానం చేసేవరకు అలుపెరగకుండా నాయకత్వాన్ని చైతన్యం చేశారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
