HomeజాతీయంSupreme Court | రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు నిర్దేశించలేవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court | రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు నిర్దేశించలేవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు చెప్పింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. బిల్లుల పెండింగ్​ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు నిర్దేశించలేవని పేర్కొంది. ఈ మేరకు సీజేఐ బీఆర్​ గవాయ్​ (CJI BR Gavai) నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం జడ్జిమెంట్​ ఇచ్చింది.

రాష్ట్రపతి, గవర్నర్​ వద్ద పెండింగ్​లో ఉన్న బిల్లుల ఆమోదంపై సమయాన్ని కోర్టులు నిర్దేశించలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ అధికారం సుప్రీంకోర్టు (Supreme Court)కు లేదని సీజేఐ పేర్కొన్నారు. అలా చేయడం అధికారాల విభజనను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. బిల్లులకు గవర్నర్ ఆమోదం ఇవ్వకపోతే తిరిగి అసెంబ్లీకి పంపాలని ధర్మాసనం సూచించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రాష్ట్ర శాసన సభలో ఆమోదించి గవర్నర్, రాష్ట్రపతి (Governor, President)కి పంపిన బిల్లును ఆమోదించే విషయంలో, వారికి న్యాయస్థానాలు ఎలాంటి గడువు విధించలేవని తెలిపింది. అలాగే కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లును వెనక్కి పంపకూడదని స్పష్టం చేసింది.

Supreme Court | తమిళనాడు కేసులో..

రాష్ట్రపతి, గవర్నర్లు తమ వద్దకు వచ్చిన బిల్లులకు మూడు నెలల్లో ఆమోదం తెలపాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్​ కేసులో సుప్రీంకోర్టు డివిజన్​ బెంచ్​ తీర్పు చెప్పగా.. తాజాగా దానిని రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) పంపిన కొన్ని బిల్లులను గతంలో ఆ రాష్ట్ర గవర్నర్​ ఆమోదించలేదు. వాటిని తన వద్ద అట్టిపెట్టుకున్నారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో విచారణ జరిపిన డివిజన్​ బెంచ్​ రాష్ట్రపతి, గవర్నర్​ మూడు నెలల్లో బిల్లులపై నిర్ణయం ప్రకటించాలని పేర్కొంది. లేదంటే ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే అని తీర్పు చెప్పింది.

Supreme Court | రాష్ట్రపతి స్పష్టత కోరడంతో..

తమిళనాడు (Tamil Nadu) స్టేట్​ వర్సెస్​ గవర్నర్​ కేసులో సుప్రీం తీర్పుపై రాష్ట్రపతి రాజ్యాంగ ధర్మాసనాన్ని స్పష్టత కోరారు. ఆర్టికల్ 200, 201 కింద కోర్టులు కాలపరిమితి చర్యను తప్పనిసరి చేయవచ్చా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రపతి పిటిషన్​ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసంన కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ ముందు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు కోర్టులు డీమ్డ్ అస్సెంట్ మంజూరు చేయలేవని కూడా ధర్మాసనం పేర్కొంది. తమిళనాడులోని 10 బిల్లులకు డీమ్డ్ అస్సెంట్ మంజూరు చేయడానికి ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆర్టికల్ 142ను ఉపయోగించడం దాని అధికారానికి మించినదని పేర్కొంది. గవర్నర్లు, రాష్ట్రపతికి ఉన్న రాజ్యాంగ అధికారాలను తాము అధిగమించలేమని కోర్టు పేర్కొంది. అదే సమయంలో గవర్నర్లు బిల్లులకు నిరవధికంగా ఆమోదాన్ని నిలిపివేయలేరని ధర్మాసనం స్పష్టం చేసింది.

Supreme Court | రాజ్యాంగ ధర్మాసనం ఏమందంటే

గవర్నర్ తన నిర్ణయాలకు వ్యక్తిగతంగా బాధ్యత వహించలేనప్పటికీ, రాజ్యాంగ న్యాయస్థానం అతని నిర్ణయాలను పరిశీలించగలదని సుప్రీంకోర్టు తెలిపింది. గవర్నర్‌కు కోర్టు సహేతుకమైన వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని చెప్పడం తప్ప వేరే కాలపరిమితి విధించలేదని పేర్కొంది. బిల్లుపై ఆర్టికల్ 200,201 ప్రకారం తన విధులను నిర్వర్తించమని కోర్టు గవర్నర్‌ను అడగవచ్చంది. కానీ దానికి అనుమతి ఇవ్వమని అడగలేమని స్పష్టం చేసింది. రాజ్యాంగ న్యాయస్థానాలు గవర్నర్ల చర్యలను ప్రశ్నించలేవని పేర్కొంది. పరిమిత పరిస్థితులలో బిల్లు లక్ష్యాలను నిరాశపరిచేందుకు ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగిందా అని మాత్రం నిర్ణయించవచ్చని చెప్పింది. గవర్నర్​ తన వద్దకు వచ్చిన బిల్లును సభకు తిరిగి ఇచ్చే విచక్షణ ఉందని, దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం ఉందని స్పష్టం చేసింది. గవర్నర్​కు ఉన్న ఈ విచక్షణాధికారాన్ని తగ్గించలేమని ధర్మాసనం పేర్కొంది.రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐతోపాటు న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్ నాథ్, P S నరసింహ, చందూర్కర్ ఉన్నారు. కాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం 5–0 తో తీర్పు చెప్పడం గమనార్హం.