Homeజిల్లాలుఆదిలాబాద్KTR | పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి : కేటీఆర్​

KTR | పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి : కేటీఆర్​

పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు కేటీఆర్​ తెలిపారు. ఆదిలాబాద్​లో కాటన్ మార్కెట్‌ను మంగళవారం ఆయన పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | రాష్ట్రంలోని పత్తిరైతుల సమస్యలను పరిష్కరించాలని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ డిమాండ్​ చేశారు. ఆదిలాబాద్ కాటన్ మార్కెట్‌ (Adilabad Cotton Market) ను మంగళవారం ఆయన సందర్శించారు. పత్తి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

రాష్ట్రంలో పత్తి రైతులు (Cotton Farmers) అనేక ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్​ ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను అమ్ముకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈరోజు పత్తి రైతులకు వచ్చిన కష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కారణమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద, రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని విమర్శించారు.

KTR | ఆ యాప్​ను ఎత్తివేయాలి

పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కోట్ల లోన్లు ఎగ్గొడితే ఎలాంటి నిబంధనలు లేవు కానీ రైతుల పంట కొనుగోలు చేయడానికి ఇన్ని నిబంధనలు ఎందుకని కేటీఆర్​ (KTR) ప్రశ్నించారు. KAPAS KISAN యాప్ రద్దు చేసి పాత పద్ధతిలో పత్తి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్​ చేశారు. రైతు కుటుంబంలో నుంచి ఎవరు పంట తెచ్చినా కొనుగోలు చేసే విధానం తేవాలన్నారు. బయోమెట్రిక్​ విధానం తీసేయాలన్నారు.

KTR | 21న ఆందోళన

ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసే వరకు తాము పోరాడతామని కేటీఆర్​ అన్నారు. రైతులు అధైర్య పడొద్దని, బీఆర్​ఎస్​ (BRS) అండగా ఉందని హామీ ఇచ్చారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామని సీసీఐ చెప్తుందని, కొన్ని చోట్ల ఎకరాకు 20 క్వింటాళ్ల పత్తి పండుతుందన్నారు. మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని ఆయన ప్రశ్నించారు. పత్తి రైతుల సమస్యలపై ఈ నెల 21న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ఆందోళన కార్యక్రమం చేపడుతామన్నారు. ఆదిలాబాద్​ జిల్లా బోరజ్​ వద్ద జాతీయ రహదారిపై చేపట్టే ఈ కార్యక్రమానికి తరలి రావాలని ఆయన కోరారు.