అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | కాంగ్రెస్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడిని పదవి నుంచి తొలగిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.
‘ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో (Somarpeta village) జరిగిన సంఘటన నా మనసును తీవ్రంగా కలిచివేసింది. ఆ దుర్ఘటనలో గాయపడిన వారి బాధను కళ్లారా చూసినప్పుడు మనసు ఎంతో వేదనకు గురైంది. నేను స్వయంగా ఆస్పత్రికి వెళ్లి వారికి పరామర్శించడం జరిగింది. వారు త్వరగా కోలుకొని తమ కుటుంబాలతో కలిసి మళ్లీ సాధారణ జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని’ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
‘ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ (police investigation) కొనసాగుతోందని.. ప్రజల్లో న్యాయం పట్ల నమ్మకం నిలబెట్టడం మా బాధ్యత.. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిపై ఆరోపణలు వస్తున్న సందర్భంగా.. నైతిక బాధ్యతగా వారిని మండల అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగిందని’ పేర్కొన్నారు.
‘దోషులు ఎవరైనా సరే, చట్టం ముందు తప్పించుకునే అవకాశం ఉండదు. దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుంది. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల బాధలో భాగస్వామిగా నిలిచే, ప్రజల పక్షాన పోరాడే పార్టీ’ అని తెలిపారు.