అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో చలి గజగజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మధ్యాహ్నం వేళ కూడా చలి పెడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా 11 రోజులుగా చలి విపరీతంగా ఉంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు (Temperatures) రికార్డు స్థాయిలో పతనం అయ్యాయి. కొన్ని గ్రామాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదు అయింది. దీంతో సాయంత్రం 6 దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఉదయం 10 గంటల వరకు కూడా చలి తీవ్రత ఉంది. అయితే రాష్ట్రంలో చలి ప్రభావం గురువారం నుంచి తగ్గుతుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. అయితే నేటి రాత్రి మాత్రం చలి వణికిస్తుందన్నారు. గురువారం రాత్రి నుండి బంగాళాఖాతంలో తేమతో కూడిన తూర్పు దీవుల కారణంగా చలి వాతావరణం తేలికగా మారుతుంది.
Weather Updates | మళ్లీ వర్షాలు..
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో వానలు దంచికొట్టాయి. నవంబర్ మొదటి వారంలో సైతం భారీ వర్షాలు కురిశాయి. అనంతరం చలి ప్రారంభం అయింది. అయితే రానున్న రోజుల్లో మళ్లీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. వాయుగుండం బలపడి తుపాన్‌గా మారే ఛాన్స్ ఉందన్నారు. తుపాన్ ఏర్పడితే సెన్యార్ అని పేరు పెట్టనున్నారు. ఇది AP తీరం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 27, 28 తర్వాత తూర్పు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ (Hyderabad) మరియు ఇతర ప్రాంతాల్లో సైతం వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
