అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Sarees | సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని బుధవారం ప్రారంభించారు. ఇందిరా గాంధీ జయంతి (Indira Gandhi Jayanthi) సందర్బంగా ఆయన నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి నివాళులుర్పించారు. అనంతరం చీరల పంపిణీ ప్రారంభించారు.
రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులకు బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేస్తామని గతంలో ప్రభుత్వం తెలిపింది. అయితే చీరలు సిద్ధం కాకపోవడంతో పంపిణీని వాయిదా వేసింది. తాజాగా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలను అందించనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం (CM Revanth Reddy) ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, సీతక్క, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
Indiramma Sarees | కోటి మంది మహిళలకు..
రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు చీరలు (Indiramma Sarees) పంపిణీ చేయనున్నారు. మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలను పంపిణీ చేస్తామన్నారు. బుధవారం నుంచి డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. అనంతరం రెండో విడతలో పట్టణాల్లోని మహిళలకు చీరలు అందిస్తామన్నారు. రెండో విడతలో మార్చి 1 నుంచి 8 వరకు ఇంటింటికి చీరలు పంపిణీ చేస్తామన్నారు. కోటి మంది మహిళలకు కోటీ చీరలు అందజేస్తామని తెలిపారు. కాగా గతంలో ఒక్కో మహిళకు రెండు చీరలు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే సీఎం వ్యాఖ్యలతో ఒక్కో చీర ఇస్తారని స్పష్టం అయింది.
Indiramma Sarees | ఇందిరా గాంధీ స్ఫూర్తితో..
తమ ప్రభుత్వం ఇందిరా గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని సీఎం అన్నారు. ఆమె సేవలను కొనియాడారు. వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలను ఓనర్లను చేశామన్నారు. ఇందిరాగాంధీ హయాంలో భూ సంస్కరణలు అమలు చేసి పేదలకు భూ పంపిణీ చేశారన్నారు. పాకిస్థాన్‌తో యుద్ధం చేసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇతర దేశాల బెదిరింపులకు తలొగ్గని ధీర వనిత ఇందిరా గాంధీ అన్నారు.
