అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Chief Minister Revanth Reddy) మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రేవంత్ మాట్లాడుతున్న మాటలను బట్టి ఆయన మానసిక స్థితిపై సందేహం కలుగుతోందన్నారు. బీజేపీతో అంటకాగుతున్న సీఎం.. బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులు రూ.2.80 లక్షల కోట్లు మాత్రమేనని, అభివృద్ధిలో తెలంగాణను నంబర్ వన్గా నిలిపామన్నారు.
కానీ తప్పుడు ఆరోపణలతో రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్‌లో ఎలాగైనా గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్లో హరీశ్ రావు (Harish Rao) శనివారం విలేకరులతో మాట్లాడారు. మందిని తొక్కడం.. మాట తప్పడం రేవంత్ రెడ్డి నైజమని ధ్వజమెత్తారు. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
Harish Rao | ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్..
ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ చూసినవారికి ఆయన మానసిక స్థితిపై సందేహం కలుగుతుందని హరీశ్ రావు అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫలించకపోవడంతో ఆ ఫ్రస్టేషన్లో గంటన్నరసేపు అడ్డమైన చెత్త వాగిండు తప్పితే అందులో విషయం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నడపడం వారికి చేతకావడం లేదని ముఖ్యమంత్రి మాటల్లో తేలిపోయిందన్నారు.
రేవంత్ రెడ్డి తన అసమర్థతను చెప్పకనే చెప్పుకున్నాడు.. రెండు సంరవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో చేసిందేమీ లేక గత కాంగ్రెస్ పాలనలో చేసింది చూసి ఓటు వేయాలని అడుగుతుండన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన చూసి ఓటేయమని అంటున్న రేవంత్ రెడ్డి.. ఆ సమయంలో టీడీపీలో (TDP) ఉన్నాడని గుర్తు చేశారు. మరీ వైఎస్సార్‌ను (YSR) ఉద్దేశించి పావురాల గుట్టలో పావురం అయ్యాడని ఎలా అన్నావు.. కాంగ్రెస్ ప్రభుత్వ జలయజ్ఞాన్ని ధనయజ్ఞమని నువ్వే అన్నావు కదా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
Harish Rao | రేవంత్, కిషన్ అన్నదమ్ములు
వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలతో పోరాడుతున్నది బీఆర్‌ఎస్ మాత్రమేనని హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సోదరులని, వారి నేతృత్వంలోనే తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. బీజేపీ, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉందని, అందుకే ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు విచారణ జరగడం లేదని గుర్తు చేశారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుర్గావ్ భట్టి విక్రమార్క ఇల్లు, ఆయన అత్తగారిల్లు ఉందని, ఈ విషయం ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్స్ అయితే ఎందుకు చెప్పలేదని, ఈడీ ఎందుకు పొంగులేటిపై ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదన్నారు. బీజేపీతో అంటకాగింది రేవంత్ రెడ్డి. బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయయన్నారు. బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఒప్పందానికి ఇదే నిదర్శమన్నారు.
