అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth Reddy | యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల (Young India Integrated Residential Schools) (వైఐఐఆర్‌ఎస్)ను మొదటి దశలో బాలికలకు అధిక సంఖ్యలో కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం సచివాలయంలో విద్యాశాఖపై (education department) సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాబోయే మూడు సంవత్సరాలలోపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాలురు, బాలికల కోసం ఒక్కో వైఐఐఆర్‌ఎస్ పాఠశాల నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత దశలో బాలికలకు పాఠశాలలు కేటాయించిన నియోజకవర్గాలలో, తదుపరి దశలో బాలుర కోసం పాఠశాలలను చేపట్టాలని సూచించారు. వైఐఐఆర్‌ఎస్ ప్రాంగణాలలో పీఎం-కుసుమ్ పథకం కింద సౌర వంటశాలల నిర్మాణ అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పనులకు సంబంధించిన బిల్లులను ఆలస్యం లేకుండా క్రమం తప్పకుండా విడుదల చేయాలన్నారు.
CM Revanth Reddy | అన్ని పాఠశాలల్లో అల్పాహారం
కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థల ద్వారా అల్పాహారం, మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తగినంత భూమి, మద్దతు అందిస్తే ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయవచ్చని అక్షయపాత్ర ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. కేంద్రీకృత వంటశాలల ఏర్పాటు కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించడం లేదా 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడంపై జిల్లా కలెక్టర్లతో సంప్రదించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు.