అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat Elections | యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైనవిగా మారాయి. ముఖ్యంగా చౌటుప్పల్ మండలం (Choutuppal Mandal)లోని తూప్రాన్‌పేట, దండుమల్కాపురం, ఆరెగూడెం వంటి గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లపై నోట్ల వర్షం కురిపించినట్లు స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే మొదలైన నగదు పంపిణీ, పోలింగ్ ముగిసే వరకు నిర్విఘ్నంగా సాగినట్లు సమాచారం. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేస్తూ ఓటును వేలం పాట స్థాయికి తీసుకెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Panchayat Elections | ఓట్ల కోసం నోట్లు
హైదరాబాద్–విజయవాడ (Hyderabad–Vijayawada) జాతీయ రహదారి వెంబడి ఉన్న ఈ గ్రామాలు పారిశ్రామికంగా, రియల్ ఎస్టేట్ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ పదవులు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో స్థిరాస్తి వ్యాపారులు భారీగా బరిలోకి దిగారు. గెలుపే లక్ష్యంగా కొందరు అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ.15,000 వరకు ఇవ్వగా, ప్రత్యర్థులు కూడా వెనక్కి తగ్గకుండా రూ.10,000 నుంచి రూ.15,000 వరకు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెండు వైపుల నుంచి నగదు అందుకున్న ఓటర్లకు ఒక్కో ఓటుపై రూ.25,000 నుంచి రూ.30,000 వరకు వచ్చినట్లు స్థానికుల కథనం.ఆరెగూడెం (Aregudem) వంటి గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు సైతం ఓటర్లను ఆకర్షించేందుకు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. విడి ఓట్లకే కాకుండా ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ ఓట్లు ఉన్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఐదు నుంచి ఆరు ఓట్లు ఉన్న కుటుంబాలకు ఒకేసారి రూ.20,000 నుంచి రూ.50,000 వరకు ముట్టజెప్పిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. మండలంలోని ఇతర గ్రామాల్లో ఓటు ధర సగటున రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఉండగా, పారిశ్రామిక ప్రాంతమైన తూప్రాన్‌పేట (Toopranpet) బెల్ట్‌లో మాత్రం రేట్లు ఆకాశాన్ని తాకాయి. నగదు పంపిణీతో పాటు మద్యం ఏరులై పారడం, విందు రాజకీయాలు పతాక స్థాయికి చేరడం ఈ విడత ప్రత్యేకతగా మారింది.గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా జరిగినప్పటికీ, రాజకీయ ఆధిపత్యం కోసం అభ్యర్థులు తమ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల సామాన్యులు, నిజాయితీ గల అభ్యర్థులు పోటీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.