అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medchal | మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భయానక ఘటన చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై ORR కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవదహనమయ్యాడు.
శామీర్‌పేట్ నుంచి కీసర దిశగా ప్రయాణిస్తున్న కారు, లియోనియో రెస్టారెంట్ (Leonio Restaurant) సమీపంలో రింగ్ రోడ్డు పక్కన ఆగి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపక్కన ఆపి, ఏసీ ఆన్ చేసి కారులోనే నిద్రిస్తున్న సమయంలోనే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. మంటలు క్షణాల్లోనే కారు మొత్తాన్ని ఆవహించడంతో డ్రైవర్ బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది. కారు పూర్తిగా కాలిపోయి బూడిదైంది.
Medchal | కారులో ఏసీ వేసుకొని నిద్రించడం ఎందుకు ప్రమాదకరం?
సమాచారం అందుకున్న వెంటనే శామీర్‌పేట్ పోలీసు (Shamirpet Police) బృందం ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టింది. మంటలు షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.నిపుణుల ప్రకారం, కారులో ఏసీ ఆన్ చేసి, అద్దాలు మూసి నిద్రించడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. ఇంజిన్ నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ (Carbon Monoxide Gas) క్యాబిన్‌లోకి ప్రవేశిస్తుంది. అది వాసన లేకుండా, తెలియకుండానే విషపూరితంగా మారి ప్రాణాంతక ప్రమాదం కలిగిస్తుంది.
ముఖ్యంగా పాత కార్లు లేదా వైరింగ్ సమస్యలు ఉన్న వాహనాల్లో ఏసీని సుదీర్ఘంగా ఆన్ చేసి ఉంచడం వల్ల ఓవర్‌హీటింగ్ జరిగి షార్ట్ సర్క్యూట్ (Short Circuit)కు దారితీయవచ్చు. ఏసీ పని చేస్తున్నప్పుడు బ్యాటరీ, వైర్లపై అధిక ఒత్తిడి పడటం వల్ల మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. అందువలన కారులో ఏసీ వేసుకొని నిద్రించడం వీలైనంత వరకు పూర్తిగా నివారించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కాసేపు మాత్రమే ఏసీని ఆన్ చేసి, అద్దాలను కొద్దిగా దించి తాజా గాలి లోపలికి వచ్చేలా చూడాలి. వాహనంలో ఎలక్ట్రికల్ వైరింగ్, ఏసీ సిస్టమ్, ఫ్యూయల్ లైన్‌లను క్రమం తప్పకుండా నిపుణులతో తనిఖీ చేయించుకోవాలి. ఓఆర్ఆర్‌పై జరిగిన ఈ దారుణం మరోసారి వాహనాల్లో ఏసీ వేసుకొని నిద్రించే ప్రమాదాన్ని గుర్తుచేసింది
