అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్ బోరబండ (Borabanda) ప్రాంతంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. తనతో మాట్లాడడం లేదన్న అనుమానంతో ఓ యువకుడు యువతిని హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హత్యకు గురైన యువతిని ఖనీజ్ ఫాతిమాగా గుర్తించారు.
నిందితుడు జహీర్ (జకీర్) గా గుర్తించగా, అతడు జ్యూస్ సెంటర్‌లో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఫాతిమా గతంలో ఓ పబ్‌లో పనిచేసే సమయంలో జహీర్‌కు పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవల ఆమె వేరే పబ్‌లో ఉద్యోగంలో చేరడంతో ఇద్దరి మధ్య సంబంధాలు దూరమయ్యాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫాతిమా తనతో మాట్లాడటం లేదని అనుమానంతో జహీర్ ఆమెపై పగ పెంచుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
Hyderabad | ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి వెనుక ఘటన..
పోలీసుల సమాచారం ప్రకారం, ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి (Erragadda Mental Hospital) వెనుక ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో జహీర్ ఫాతిమాను హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు, మొదట హత్యకు యత్నించగా ఫాతిమా తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత నిందితుడు బండరాయితో మోదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని అనుమానిస్తున్నారు. హత్య అనంతరం జహీర్ సమీపంలోని బస్తీకి వెళ్లి విషయం చెప్పినట్లు సమాచారం. బస్తీ వాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫాతిమా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ హత్యను నిందితుడు ఒక్కడే చేశాడా? మరెవరైనా పాత్ర ఉందా? అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, మాట్లాడుదామని పిలిచి హత్య చేశాడా? లేక ముందే హత్య ఉద్దేశంతో నిర్మానుష్య ప్రదేశానికి యువతిని తీసుకువచ్చాడా? అనే అంశాలపై కూడా విచారణ సాగుతోంది. జన సంచారానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతటి నిర్మానుష్య ప్రాంతానికి యువతి ఎందుకు వెళ్లిందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. నిందితుడిని బోరబండ పోలీసులు (Borabanda Police) అదుపులోకి తీసుకుని విచారించగా, పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.