అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bomb Threat Mail | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
బాంబు బెదిరింపు మెయిల్ (Bomb Threat Mail) రావడంతో CISF సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేశారు. అనుమానిత వస్తువులను పరిశీలించారు. సందర్శకుల పాసుల కౌంటర్ మూసివేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అయితే అది ఫేక్ మెయిల్ (Fake Mail) అని నిర్ధారించుకున్నారు. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Bomb Threat Mail | నిత్యం బెదిరింపులు
దేశంలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం బాంబు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ప్రజలతో పాటు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఢిల్లీలో కారు బాంబు పేలుడు అనంతరం ఇలాంటి ఫేక్ మెయిల్స్ ఎక్కువ అయ్యాయి. మెయిల్ రాగానే అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఎయిర్‌పోర్టులు (Airports), విమానాలకు ఎక్కువగా బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని పలు కోర్టులు, విద్యాసంస్థలకు దుండగులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. 4 కోర్టులు, రెండు సీఆర్పీఎఫ్ సూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సాకేత్, రోహిణి, ద్వారక, పాటియాలా కోర్టులకు బెదిరింపులు రావడంతో సిబ్బంది, లాయర్లను బయటకు పంపి తనిఖీలు చేపట్టారు.
అనంతరం అవి నకిలీ బెదిరింపులుగా గుర్తించారు. ఇటీవల ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లుగా సైతం మెయిల్స్ వచ్చాయి. జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు (Shamshabad Airport) వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో సెక్యూరిటీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాన్ని ముంబాయి ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసులకు సెక్యూరిటీ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
