అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bihar CM Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ (Governor Arif Mohammad Khan) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డా, ఎన్డీయే నాయకులు పాల్గొన్నారు.
బీహార్‌లో (Bihar) ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ కూటమి 202 స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. దీంతో తమ సీఎం అభ్యర్థిగా నితీశ్‌ను ఎన్డీఏ ప్రకటించింది. ఈ మేరకు నితీశ్‌కుమార్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో (Gandhi Maidan) గురువారం నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకార వేడుక నిర్వహించారు.
Bihar CM Nitish Kumar | మంత్రులు సైతం..
ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో (CM Nitish Kumar) పాటు ఎన్డీఏ కూటమి నుంచి పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. లెషి సింగ్, సంతోష్ కుమార్ సుమన్, మదన్ సాహ్ని, రామ్ కృపాల్ యాదవ్, నితిన్ నవీన్, సునీల్ కుమార్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, మంగళ్ పాండే, విజయ్ చౌదరి, శ్రవణ్ కుమార్, బిజేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్, అశోక్ చౌదరి మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ కుమార్ సిన్హా సైతంఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి 12 మంది, 9 మంది, లోక్ జన శక్తి పార్టీ నుంచి ఇద్దరు, ఆర్ఎల్ఎం పార్టీ నుంచి ఒక్కరు, హెచ్ఏఎం నుంచి ఒక్కరు మంత్రులుగా ప్రమాణం చేశారు.
Bihar CM Nitish Kumar | పదో సారి..
బీహార్ సీఎం నితీశ్‌కుమార్ పదో సారి ప్రమాణం చేశారు. సీఎంగా అత్యధిక సార్లు ప్రమాణ స్వీకారం చేసిన నేతగా నితీశ్‌కుమార్ రికార్డు సృష్టించారు. అలాగే ఆయన సుదీర్ఘ కాలంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 1951లో జన్మించిన ఆయన తొలి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మూడోసారి 1985లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం ఎంపీగా సైతం గెలుపొంది కేంద్ర మంత్రిగా పని చేశారు. 2000 మార్చి 3న తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అప్పుడు ఏడు రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. అనంతరం 2005లో రెండోసారి సీఎం అయ్యారు. అప్పటి నుంచి నితీశ్‌కుమార్ బీహార్ సీఎంగా కొనసాగుతుండడం గమనార్హం.
