అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mohanbabu University | టాలీవుడ్ ప్రముఖుడు మంచు మోహన్‌బాబు(Manchu Mohanbabu)కి చెందిన మోహన్‌బాబు యూనివర్సిటీ తాజాగా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ విచారణలో ఆయన యూనివర్సిటీ 2022-23 నుంచి 2024 వరకు కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి అధికంగా రూ.26 కోట్లకు పైగా ఫీజులు వసూలు చేసిందని నిర్ధారణ అయింది.
ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయంపై రూ.15 లక్షల జరిమానా విధించడమే కాక, అదనంగా వసూలు చేసిన రూ.26.17 కోట్లుని 15 రోజుల్లో విద్యార్థులకు తిరిగి చెల్లించాలన్న ఆదేశాలను జారీ చేసింది. ఇదే కాక, యూనివర్సిటీకి మంజూరైన గుర్తింపును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ వంటి జాతీయ స్థాయి విద్యా నియంత్రణ సంస్థలకు కమిషన్ సిఫారసు చేసింది.
Mohanbabu University | ఎందుకు ఈ జరిమానా?
తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీ 2022లో ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మోహన్‌బాబు యూనివర్సిటీగా (Mohan Babu University) మారింది. గ్రీన్‌ఫీల్డ్ యూనివర్సిటీగా మారిన తరువాత, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు స్ట్రక్చర్‌కు వ్యతిరేకంగా యూనివర్సిటీ అధికంగా ఫీజులు వసూలు చేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రుల అసోసియేషన్, విద్యార్థి సంఘాలు ఫిర్యాదులు చేశారు.కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి మాత్రమే కాదు, హాస్టల్‌లో ఉండని వారి నుంచి కూడా మెస్ ఛార్జీలు వసూలు చేయడం, అదనపు బిల్డింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా కమిషన్ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపింది. అందులో ఆరోపణలు నిజమని తేలింది.
కమిషన్ ఆదేశాలపై మోహన్‌బాబు యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andhra Pradesh High Court)ను ఆశ్రయించగా, కోర్టు గత నెల 26న మూడు వారాల తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణ అక్టోబర్ 14కి వాయిదా పడింది. ఈ కేసు ప్రస్తుతం న్యాయపరంగా ముందుకెళ్తోంది. ఇక ఇప్పటికే యూనివర్సిటీపై AICTEతోపాటు ఇతర కేంద్ర సంస్థలకు కూడా పలు ఫిర్యాదులు వెళ్లాయి. విద్యార్థి సంఘాలు మీడియా సమావేశాలు నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశాయి. గతంలో మంచు మనోజ్ మరియు మంచు విష్ణు మధ్య జరిగిన కుటుంబ వివాద సమయంలో, మనోజ్ తన తండ్రి మోహన్‌బాబు యూనివర్సిటీపై వచ్చిన ఆరోపణల విషయంలో విద్యార్థులకు మద్దతుగా ఉంటానని ప్రకటించడమే కాకుండా, తల్లిదండ్రుల పక్షాన నిలుస్తానని చెప్పడం సంచలనం రేపింది.